జహీరాబాద్, మే 1: దేశవ్యాప్తంగా కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా నిర్మాణం చేస్తున్న 12 గ్రీన్ ఫీల్డ్ ఇండస్ట్రియల్ జోన్లలో ఒకటైన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో పారిశ్రామిక స్మార్ట్ సిటీపై ఆశలు చిగురిస్తున్నాయి. నిమ్జ్ ప్రాజెక్టు కోసం మొదటి విడతలో న్యాల్కల్, ఝరాసంగం మండలాల పరిధిలో సేకరించిన భూముల్లో పారిశ్రామిక స్మార్ట్ సిటీ ఏర్పాటు చేయనున్నారు. దీని కోసం ఈ నెల 10వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు. పారిశ్రామిక స్మార్ట్ సిటీలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు కావాల్సిన మౌలిక వసతులు ఏర్పాటు చేసేందుకు సంబంధిత అధికారులు పనులను ముమ్మరం చేస్తున్నారు. ఆయా మండలాల పరిధిలోని గ్రామాల్లో సేకరించిన భూముల్లో కడీలు పాతి ఫెన్సింగ్ ఏర్పాటు చేసి స్వాధీనం చేసుకుంటున్నారు.
అందులో భాగంగా రోడ్లు, పారిశుధ్యం, వీధిలైట్లు, తాగునీటి వసతి వంటి పనులు చేస్తున్నారు. ఐటీ, పారిశ్రామిక రంగాలు కేవలం హైదరాబాద్‌కే పరిమితం కాకుండా వరంగల్, జహీరాబాద్ ప్రాంతాలకు విస్తరించాలనే ఉద్దేశంతో 2024 ఆగస్టులో కేంద్రం జహీరాబాద్ ప్రాంతంలో పారిశ్రామిక స్మార్ట్ సిటీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. దీనికి జాతీయ పారిశ్రామిక కారిడార్, అభివృద్ధి అమలు ట్రస్టు ఆమోదం తెలిపింది. ఈ స్మార్ట్ సిటీ ఏర్పాటుతో రూ.10వేల కోట్ల పెట్టుబడులు రాబట్టి, ప్రత్యేకంగా, పరోక్షంగా 10 లక్షల మందికి ఉపాధి కల్పించనున్నట్లు కేంద్రం పేర్కొంది. దీని కోసం రూ. 2,369 కోట్ల అంచనాతో మౌలిక వసతుల కల్పన కోసం పనులను ముమ్మరం చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో హైదరాబాద్-ముంబాయి 65వ జాతీయ రహదారితో నిమ్జ్ ప్రాజెక్టుకు అనుసంధానం చేస్తూ రూ. 100 కోట్లతో యాక్సెస్ రోడ్డు ఏర్పాటు చేసింది. పారిశ్రామిక స్వార్ట్ సిటీ ఏర్పాటులో భాగంగా నిమ్జ్ ప్రాజెక్టు మొదటి విడతలో సేకరించిన భూముల్లో మౌలిక వసతుల కల్పన పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 10వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ర్టానికి వస్తున్న సందర్భంగా జహీరాబాద్ పారిశ్రామిక స్మార్ట్ సిటీ ఏర్పాటు కోసం శంకుస్థాపన చేయనున్నట్లు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే నిమ్జ్ ప్రాజెక్టులో హ్యుందాయ్, వెమ్ టెక్నాలజీ కంపెనీల ఏర్పాటు పనులు కొనసాగుతున్నాయి. తాజాగా పారిశ్రామిక స్మార్ట్ సిటీ ఏర్పాటుతో జహీరాబాద్ ప్రాం తంలో ఉద్యోగాలు, ఉపాధి లభించే అవకాశం ఉంటుందని నిరుద్యోగ యువతీ యువకుల్లో మరింత ఆశలు చిగురిస్తున్నాయి.