సిద్దిపేట అర్బన్, మార్చి 21: సిద్దిపేట పట్టణ పరిధిలోని రంగధాంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద అరుదైన సంఘటన చోటు చేసుకుంది. సిద్దిపేట పట్టణం హనుమాన్‌నగర్‌కు చెందిన పర్వతం శ్వేత అనే విద్యార్థిని మండల పరిధిలోని మిట్టపల్లి గురుకుల పాఠశాలలో చదువుతున్నది. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్వేత కాలు విరిగింది. సిద్దిపేటలోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతుంది. శ్వేతకు గురువారం రాత్రి వైద్యులు సర్జరీ చేశారు.
శుక్రవారం పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన దృష్ట్యా విద్యార్థిని తండ్రి శంకర్ శ్వేతను అంబులెన్స్‌లో పరీక్షా కేంద్రానికి తీసుకువచ్చి పరీక్ష రాయించారు. ఎలాగైనా పరీక్ష రాస్తానని శ్వేత చెప్పడంతో అంబులెన్స్ ద్వారా పరీక్షా కేంద్రానికి తీసుకువచ్చి స్ట్రెచర్‌పైనే పరీక్ష రాయించారు. పరీక్ష పూర్తయిన వెంటనే శ్వేతను మళ్లీ దవాఖానకు తీసుకెళ్లారు. మాజీ మంత్రి హరీశ్‌రావు సైతం విద్యార్థినితో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పినట్లు శ్వేత తండ్రి శంకర్ తెలిపారు.
నర్సాపూర్, మార్చి 21 : తెల్లారితే పదో తరగతి పరీక్షలు. అంతలోనే అనారోగ్యంతో నాన్నమ్మ చనిపోవడంతో ఇంట్లో విషాదం నెలకొంది. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం బ్రాహ్మణపల్లికి చెందిన గుండె రామకృష్ణ అదే గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. గురువారం రాత్రి రామకృష్ణ నాన్నమ్మ అనారోగ్యంతో కన్నుమూసింది. మృతురాలికి ఇద్దరు కుమారులు.
వారిద్దరు గతంలోనే మృతిచెందడంతో మనుమడైన రామకృష్ణ తలకొరిమి పెట్టడం అనివార్యమైంది. పరీక్షకు హాజరు కావాలా వద్దా అన్న సందిగ్ధ్దంలో ఉన్న రామకృష్ణకు తనతల్లి సంతోష సూచనతో బరువెక్కిన హృదయంతో, కన్నీళ్లను దిగమింగుకొని పరీక్షకు హాజరయ్యాడు. పరీక్ష రాసి వచ్చిన అనంతరం తలకొరిమి పెట్టి అంత్యక్రియలు పూర్తిచేయించారు.