మునిపల్లి, జూన్ 13: సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని కంకోల్లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రత్యేక చొరవతో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ దవాఖాన, ఇటీవల ప్రారంభించిన హెల్త్ సబ్‌సెంటర్ ప్రజలకు అందుబాటులో ఉంచడానికి 108 అంబులెన్స్‌ను సమకూర్చారు. మునిపల్లి మండల ప్రజల సౌకర్యార్ధం మంత్రి దామోదర ఏర్పాటు చేసిన 108 అంబులెన్స్ కంకోల్ హెల్త్ సబ్ సెంటర్ వద్ద ఉండి సేవలు అందించాల్సి ఉంటుంది. కానీ, సంబంధిత అధికారులు దానిని రాయికోడ్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
దీంతో మునిపల్లి మండల ప్రజలకు సరిగ్గా 108 అంబులెన్స్ సేవలు అందకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మునిపల్లి మండలం మీదుగా జాతీయ రహదారి వెళ్తున్నది. తరుచూ ప్రమాదాలు జరుగుతుంటాయి. అత్యవసర సేవలు అం దించడానికి 108 అంబులెన్స్ చాలా అవసరం.కానీ, ఇవేవి పట్టించుకోకుండా అధికారులు రాయికోడ్‌కు అంబులెన్స్ ఎలా పంపుతారని మండల వాసులు మండిపడుతున్నారు. మంత్రి దామోదర రాజనర్సింహ తో పాటు జిల్లా అధికారులు స్పందించి 108 అంబులెన్స్‌ను మునిపల్లికి పంపించాలని మండల ప్రజలు కోరుతున్నారు.