మెదక్, ఫిబ్రవరి 25(నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం కేంద్ర ప్రభుత్వంతో పాటు అనేక రాష్ర్టాలను ఆకర్షించి వారు అమలు చేసేలా చేసింది. ఐక్యరాజ్యసమితి మన్ననలు సైతం పొందింది ఈ పథకం. కేసీఆర్ సీఎం ఉన్నన్ని రోజులుగా ఏటా యాసంగి, వానకాలం రెండు పంటలకు సమయానికి రైతుల ఖాతాల్లో రైతుబంధు జమచేసేవారు. దీంతో రైతులకు పెట్టుబడి కష్టాలు తీరాయి. వడ్డీ వ్యాపారులను ఆశ్రయించే బాధలు తప్పాయి.
ప్రస్తుతం కాంగ్రెస్ సర్కారు రైతుబంధును రైతుభరోసాగా పేరు మార్చి అమలు చేస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎకరాకు రూ.5వేల చొప్పున రెండు పంటలకు కలిపి ఏటా రూ.10వేలు అందించింది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుభరోసా పథకం కింద ఎకరాకు రూ.6వేల చొప్పున ఇస్తామని చెప్పి అమలులో ఆలస్యం చేస్తున్నది. గతనెల 27న ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించి మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసింది. ఆ గ్రామంలోనే రైతు భరోసా నగదును రైతుల ఖాతాల్లో జమచేసింది. దీంతో మిగతా గ్రామాల రైతులు రైతు భరోసా సాయానికి ఎదురుచూస్తున్నారు.
రైతు భరోసా సాయం కొందరికే అందింది. ఇప్పటి వరకు మూడు ఎకరాల్లోపు రైతులకు మాత్రమే నగదు జమ అయింది. ప్రభుత్వం మూడు ఎకరాల్లోపు రైతుల ఖాతాల్లో డబ్బులు వేశామని చెబుతున్నది. బ్యాంక్‌కు వెళ్లి రైతులు తమ అకౌంట్లో చూస్తే రైతు భరోసా డబ్బులు రాలేదని పలువురు రైతులు వాపోతున్నారు. ఎంపిక చేసిన గ్రామాల్లో మాత్రం ఎన్ని ఎకరాలు ఉన్నా నగదు అందింది. తర్వాత ఎకరా, రెండు, మూడు ఎకరాల్లోపు రైతులకు విడతల వారీగా నగదు జమ చేస్తోంది.
కానీ, ఇంకా ఎకరం, రెండు, మూడు ఎకరాల్లోలోపు ఉన్న కొందరికీ నగదు జమ కాకపోవడంతో బ్యాంకుల చుట్టూ రైతులు ప్రదక్షిణ చేస్తున్నారు. ఎందుకు రైతు భరోసా డబ్బులు పడలేదని వ్యవసాయ శాఖ అధికారులను ప్రశ్నిస్తున్నారు. వివిధ కారణాలతో నగదు జమ కాలేదని అధికారులు సమాధానం ఇస్తున్నారు. మూడు ఎకరాలకు పైబడి భూమి ఉన్న రైతులు వేల సంఖ్యలో ఉన్నారు.. నాలుగో విడత ఎప్పుడు వస్తుందోనని రైతు భరోసా కోసం రైతులు ఎదురుచూస్తున్నారు.
మెదక్ జిల్లాలో మొత్తం 2,91,399 మంది రైతులు ఉన్నారు. వీరికి రూ. 231,85,45,057 డబ్బులు ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు 2,06,472 మంది రైతులకు రూ. 126,35,44,611 ఖాతాల్లో జమ అయ్యింది. ఇంకా 84,927 మంది రైతులకు రూ.105 కోట్ల రైతు భరోసా జమ కావాల్సి ఉంది. ఇప్పటి వరకు మూడు ఎకరాల వరకు ఉన్న రైతులకు రైతు భరోసా అందించామని ప్రభుత్వం చెబుతున్నా, అది క్షేత్రస్థాయిలో అందరు రైతులకు అందలేదని తెలిసింది. ఈ లెక్కన పది ఎకరాలు ఉన్న రైతులకు సాగు సాయం అందాలంటే మరో రెండు నెలల సమయం పడే అవకాశం ఉంది.