Tree | నర్సాపూర్: 100 ఏళ్లకు పైబడిన చరిత్ర గలిగిన ఓ భారీ వృక్షం అగ్నికి ఆహుతైన ఘటన మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే బ్రాహ్మణపల్లి గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద వంద సంవత్సరాలు పైబడిన ఓ వేప చెట్టు ఉంది. అయితే సోమవారం సాయంత్రం సమయంలో అనుమానాస్పద స్థితిలో అగ్ని మంటలు చెలరేగడంతో భారీ వృక్షానికి మంటలు అంటుకుంటున్నాయి. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. గ్రామస్తులు మంటలు ఆర్పడానికి ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది.
వెంటనే గ్రామస్తులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో ఘటనాస్థలానికి ఫైర్ ఇంజన్ చేరుకుంది. అయితే చెట్టు వద్దకు రోడ్డు సరిగ్గా లేకపోవడంతో ఫైర్ ఇంజన్ ఆలస్యంగా వెళ్లడంతో చెట్టు పూర్తిగా దగ్ధమైంది. ఎట్టకేలకు ఫైర్ సిబ్బంది చెట్టు వద్దకు చేరుకొని మంటలను అదుపు చేశారు. ఇదిలా ఉండగా అదే రోజు రాత్రి విపరీతమైన గాలి వీయడంతో కాలిపోయిన చెట్టు కాస్త కూలిపోవడం జరిగింది. గ్రామంలో ఉన్న వృద్ధులను వేప చెట్టు గురించి అడిగితే.. ‘మా చిన్నప్పటి నుండే ఆ చెట్టు అలానే ఉందని’ చెప్పడం ఆ చెట్టుకు గల చరిత్రను తెలియజేస్తుంది.
ఆ వేప చెట్టును 150 సంవత్సరాల క్రితమే అక్కడ పూర్వికులు నాటి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఆంజనేయస్వామి విగ్రహం వద్దనే ఆ చెట్టు ఉండడంతో చెట్టును కూడా ఓ దైవంగా భావించామని గ్రామస్తులు తెలియజేశారు. భారీ వృక్షం అగ్నికి ఆహుతై కూలిపోవడంతో గ్రామానికి ఏమైనా అరిష్టం జరుగుతుందా అని.. ? గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.