సిద్దిపేట, ఆగస్టు 19( నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రస్తుతం వానకాలం వ్యవసాయ పనుల్లో బిజీగా గడపాల్సిన రైతులు రోడ్డెక్కుతున్నారు. రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని మండిపడుతున్నారు. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో రెం డు రోజులుగా నిరసనలు చేపడుతున్నారు. మూడు విడతల్లో రైతులకు రుణమాఫీ చేశామని ప్రభుత్వం గొప్ప లు చెప్పుకుంటున్నది. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు విరుద్ధ్దంగా ఉన్నాయి. ఏ గ్రామంలో చూసినా 50శాతం మందికి రుణాలు మాఫీ కాలేదని స్వయంగా రైతులే చెబుతున్నారు.
రుణమాఫీ ఎగ్గ్గొట్టాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం అనేక కొర్రీలు పెట్టి సగం మం ది రైతులను రుణమాఫీకి దూరం చేస్తున్నదని ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆగస్టు 15లోగా రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి మొండిచెయ్యి చూపిందని వారు ఆరోపిస్తున్నారు. రెండు విడతల్లోనే చాలా మంది రైతులకు రుణమాఫీ కాలేదు. మూడో విడత రుణమాఫీని స్వాతంత్య్ర దినోత్సవం రోజున ప్రకటించినప్పటికీ అంతా గందరగోళంగా ఉంది.
ఉమ్మడి మెదక్ జిల్లాలో రైతులకు రుణమాఫీ విషయం లో కాంగ్రెస్ ప్రభుత్వం మొండి చెయ్యి చూపుతోంది. రైతుల సంఖ్యకు రుణమాఫీ లెక్కలకు పొంతన లేకుం డా పోయింది.లక్ష రూపాయల వరకు ఒకసారి, లక్షన్నర వరకు రెండోసారి, రెండు లక్షల వరకు మూడోసారి రుణమాఫీ చేస్తున్నట్లు ఆగస్టు 15న కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. బీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేసింది.
అప్పటి ఇప్పటి లెక్కలకు చూసుకుంటే రుణమాఫీ రైతుల సంఖ్యను కాంగ్రెస్ ప్రభుత్వం భారీగా తగ్గించింది. రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తే రైతుల సంఖ్య పెరగాలి కానీ తగ్గింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో లక్ష రూపాయల రుణమాఫీ చేసినప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 4,17,591 మందికి రుణమాఫీ జరిగింది. 2014లో ఉమ్మడి మెదక్ జిల్లాలో 1,50,000 మంది రైతులకు రూ.398 కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం మాఫీ చేసింది. 2018లో సిద్దిపేట జిల్లాలో 81,565 మందికి రూ. 418 కోట్లు, మెదక్ జిల్లాలో 73,026 మందికి రూ. 366.39 కోట్లు, సంగారెడ్డి జిల్లాలో 1,13,000 మం దికి రూ. 678 కోట్లు మాఫీ చేసింది.
బీఆర్ఎస్ హయాంలో లక్ష రూపాయల్లోపు రుణమాఫీ జరిగింది. మొత్తంగా 4,17,591 మందికి రూ. 1,860.39 కోట్లు రుణమాఫీ చేసి బీఆర్ఎస్ రైతు ప్రభుత్వం అని నిరూపించుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.రెండు లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేసినట్లు చెప్పుకుంటున్న ది. కానీ, వీరు చేసింది ఎంతంటే 2,85,493 మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేశారు. ప్రభుత్వం 1,32,098 మంది రైతులకు కోత పెట్టింది. రైతుల సం ఖ్య పెరగాల్సి ఉండగా, భారీగా తగ్గించింది. దీంతో గ్రామాల్లో 50శాతం మందికి కూడా రుణమాఫీ కాలే దు. దీంతో ప్రభుత్వతీరుపై రైతులు రగిలిపోతున్నారు.
రుణమాఫీపై ఉమ్మడి జిల్లాలోని గ్రామాల్లో నిరసనలు, రాస్తారోకోలు, సీఎం దిష్టిబొమ్మల దహనాలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు ఓపిక పట్టిన రైతలకు నిరాశే మిగలడంతో వారిలో ఆగ్రహం వ్యక్తమవుతున్నది. మూడో విడతల్లో అయినా తమకు రుణమాఫీ కాకపోదేమో అని అనుకున్న రైతులు, చివరి విడతలో కూడా ప్రభుత్వం మొండిచేయి చూపడంతో రగిలిపోతున్నా రు. మూడో విడత ప్రకటన తర్వాత ఎక్కడ చూసినా ప్రభుత్వ తీరుపై రైతుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్నది.
ఏవేవో కారణాలు చెప్పి ప్రభుత్వం రుణమా ఫీ ఎగ్గ్గొట్టే ప్రయత్నం చేస్తున్నదని రైతులు మండిపడుతున్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం అక్కెనపల్లిలో సీఎం రేవంత్ దిష్టిబొమ్మకు రైతులు శవయాత్ర నిర్వహించి గ్రామ కూడలిలో దహ నం చేశారు. చాలాగ్రామాల్లో నిరసనలు చేపట్టారు. అక్కన్నపేట మండలంలోని కట్కూరు గ్రామంలో రైతులు బ్యాంకుల ఎదుట నిరసన తెలిపారు. ఇలా ప్రతిరోజు నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి.