సిద్దిపేటరూరల్, మే 10: పది ఫలితాల్లో అదే స్ఫూర్తి కొనసాగింది. ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు నిరంతర పర్యవేక్షణలో సిద్దిపేట జిల్లా మరోసారి రాష్ట్రస్థాయిలో ఆదర్శంగా నిలిచింది. బుధవారం విడుదలైన పదోతరగతి ఫలితాల్లో జిల్లా రెండోస్థానంలో నిలిచింది. గతేడాది 97.85శాతం ఉత్తీర్ణత రాగా ఈ ఏడాది 98.65 శాతం సాధించి గతం కంటే 0.80 శాతం ఉత్తీర్ణత పెరిగింది. విద్యార్థులకు డిజిటల్ క్లాసులు, ప్రత్యేక తరగతుల నిర్వహణ, స్నాక్స్ , తల్లిదండ్రులకు ఉత్తరం, ఎప్పటికప్పుడు టెలీ కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి నింపిన ఆత్మవిశ్వాసంతో పదిలో పంథా తగ్గలేదు. హెచ్ఎంలతో సమీక్షలు నిర్వహించడం కలిసొచ్చింది. అంతకుముందు రెండేండ్లు 2,3 స్థానాల్లో నిలువగా గతేడాది ప్రథమస్థానం, ఈ ఏడాది రెండోస్థానంలో నిలిచింది. సిద్దిపేట జిల్లా అభివృద్ధితోపాటు విద్యలోనూ ముందుండాలనే మంత్రి హరీశ్‌రావు ఆకాంక్షకు అనుగుణంగా అటు విద్యార్థుల పట్టుదల, ఇటు తల్లిదండ్రుల తపన తోడై రాష్ట్రస్థాయిలో పేరువచ్చేలా చేశాయి. పదికి పది జీపీఏ సాధించిన విద్యార్థులకు రూ.10 వేలు, వందశాతం ఉత్తీర్ణతశాతం సాధించిన ప్రభుత్వ పాఠశాలలకు రూ.25 వేలు నగదు పురస్కారం మంత్రి స్వయంగా అందించనున్నారు. జూన్‌లో విద్యాసంవత్సరం ప్రారంభంలో అందిస్తారు. జిల్లాలో 126 మంది పది జీపీఏ సాధించారు. 219 ప్రభుత్వ పాఠశాలలు,8 మండలాలు ఫలితాల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించాయి.
ఉత్తమ ఫలితాల సాధనకు మంత్రి హరీశ్‌రావు నిరంతరం ప్రత్యేక చొరవ తీసుకున్నారు. పాఠశాల స్థాయి ఉపాధ్యాయుడి నుంచి కలెక్టర్‌తో సమీక్షలు జరిపారు. పలుమార్లు హెచ్ఎంలు, అధికారులతో ముఖాముఖి సమావేశమై సలహాలు, సూచనలు ఇస్తూ సమస్యలు తెలుసుకున్నారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపేలా తల్లిదండ్రులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి సోషల్ మీడియా, సెల్ఫోన్లకు దూరంగా ఉండేలా చూడాలని కోరారు.
“హలో..నేను మీ హరీశ్‌రావును అమెరికా నుంచి మాట్లాడుతున్న.. మీ బిడ్డ టెన్త్ పాస్ అయి ంది.. ఇంజినీరింగ్, డాక్టర్ అయ్యే చదువు చదివిస్తారా..కొడుకు పాస్ అయితే స్వీట్లు పంచిం డ్ర..మీ బిడ్డ పాస్ అయితే సంతోషం అనిపిస్తుం దా..పరీక్షల్లో మీ బిడ్డ పాస్‌కావాలి..మంచి మార్కులు తెచ్చుకోవాలి.. మీ టీవీలు, ఫోన్లు బంద్చేయాలి అని ఉత్తరం రాసిన గుర్తుందా”అని పదోతరగతి విద్యార్థులు, తల్లిదండ్రులతో మాట్లాడి వారిలో మరింత ఆత్మవిశ్వాసం నిం పారు. ఆమెరికా నుంచి టెలీకాన్ఫరెన్స్‌లో బుధవారం మంత్రి హరీశ్‌రావు కలెక్టర్, విద్యాశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు. ఉత్తీర్ణులైన విద్యార్థులను ఆత్మీయంగా పలకరిస్తూ మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. పదోతరగతిలో పాస్ అయిన విద్యార్థులను చూస్తుంటే నా పిల్లలు పాస్ అయినట్లు సంతోషంగా ఉందన్నారు. మైసంపల్లికి చెందిన శ్రావణి అనే విద్యార్థిని తల్లి స్వప్నతో మంత్రి నేరు గా ఫోన్లో మాట్లాడడం విశేషం. మంత్రి స్వయంగా ఫోన్ చేయడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. ఏం చదివిస్తారని మంత్రి అడగ్గా డాక్టర్ చదివిస్తానని చెప్పడంతో మన సిద్దిపేటలోనే డాక్టర్ చదువు అందుబాటులోకి వచ్చిందని శ్రావణి తల్లికి మంత్రి వివరించారు. హమాలీ కార్మికుడి కుమారుడు సతీశ్‌తో మాట్లాడిన మంత్రి ఇంజినీరింగ్ అవుతావా అని అడిగారు. మరికొంతమంది విద్యార్థులతో మాట్లాడి మంచి మార్కు లు తెచ్చుకున్నందుకు శుభాకాంక్షలు తెలిపారు.