సిద్దిపేట, నవంబర్ 4(నమస్తే తెలంగాణ ప్రతినిధి): అయ్యోదేవుడా మాకు ఇదేం గోస.. ఆరుగాలం కష్టించి పంట పండించే మా రైతుల మీద ఇంతగా పగబట్టావు. నోటి కాడికొచ్చిన బువ్వ నేల పాలైంది. కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యం తడిసి ముద్దయ్యింది. వరుసగా కురుస్తున్న వర్షాలకు ధాన్యం మొలకలు వచ్చాయి.ఆ మొలకలు ఏకంగా పొలంలో మళ్లీ నాటువేసే విధంగా వచ్చాయని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల గోసను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. పేరుకు మాత్రమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. కానీ, నత్తనడకన కొనుగోళ్లు జరుగుతుండడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే కొనుగోలు కేంద్రాల్లో వడ్లు తడిసి తాము నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. పంట చేతికి వచ్చి కోత కోసి ఆరబెట్టగానే అకాల వర్షం కురిసి ఆగంజేస్తున్నదని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు.
వానకాలం సీజన్‌కు సంబంధించి నవంబర్ నెల రాగానే 70శాతం వరకు ధాన్యం సేకరణ చేపట్టాల్సి ఉండగా, ఈసారి ఇప్పటి వరకు 20శాతం వడ్లు కూడా ప్రభుత్వం కొనలేదు. దీంతో రైతులు రోడ్డెక్కుతున్నారు. నిత్యం ఏదో ఒకచోట ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు ధర్నాలు చేస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో 5,03,800 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం కాగా, ఇప్పటి వరకు కేవలం 16,982 మెట్రిక్ టన్నులు 3251 మంది రైతుల నుంచి కొన్నారు. ఇటీవల హుస్నాబాద్ ప్రాంతంలో భారీగా కురిసిన వర్షానికి ధాన్యం కొట్టుకుపోయింది. జిల్లాలో మొత్తం 1400 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు అధికారులు తెలిపారు. దీని విలువ రూ 36 కోట్లు కాగా, కేవలం రూ. 6 కోట్లు మాత్రమే రైతులకు చెల్లించారు. మెదక్ జిల్లాలో 3,20,500 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం కాగా, 26,391 మెట్రిక్ టన్నులు కొన్నారు. రూ.58.71 కోట్లకు ఇప్పటి వరకు రైతులకు రూ. 4.34 కోట్లు మాత్రమే చెల్లించారు. ధాన్యం కేంద్రానికి తెచ్చి 15 నుంచి 20 రోజులు అవుతున్నా కాంటా కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు ప్రకృతి కన్నెర జేయడం, ఇటు ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రెంటికి చెడ్డ రేవడిలా రైతుల పరిస్థితి తయారైంది.అకాల వర్షాలు రైతులను ఆగంజేసి నష్టాలనే మిగిలిస్తున్నాయి.
నిర్వాహకులు, మిల్లర్లు, సంబంధిత అధికారులు కుమ్మక్కై ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పచ్చి ధాన్యం, తేమ, తాలు పేరిట కొర్రీలు పెట్టి క్వింటాల్‌కు నాలుగు కిలోల నుండి ఆరు కిలోల వరకు తరుగు తీస్తూ దోచుకుతింటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇటీవల సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం అక్కెనపల్లికి చెందిన మహిళా రైతుకు సంబంధించి 200 బస్తాలకు 9 బస్తాలు తరుగు పేరిట కోత పెట్టారని బాధిత రైతు ఆరోపించారు. మిల్లర్లు, నిర్వాహకులు, అధికారులు కలిసి ప్రతి 200 బస్తాలకు 5 నుంచి 10 బస్తాల ధాన్యం కోత పెడుతున్నారు. దీనిపై ప్రశ్నిస్తే ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోండి అని సమాధానం ఇస్తున్నారు. అలా అయితేనే తాము ధాన్యం దించుకుంటామని మిల్లర్లు చెబుతున్నారు.ముందుగా వీరు చేసుకున్న ఒప్పందం ప్రకారం కోతలు విధిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇతరత్రా ఖర్చులు భారీగానే అవుతున్నాయని రైతులు వాపోతున్నారు. కొనుగోలు కేంద్రాల్లో కనీస వసతులు కరువయ్యాయి. ధాన్యం మీద టార్పాలిన్లు కప్పుదామన్నా వాటిని అందుబాటులో ఉంచడం లేదు. మట్టి కల్లాలు కావడంతో వర్షం పడితే కొనుగోలు కేంద్రాల ఆవరణలు బురదమయం అవుతున్నాయి. వర్షం నీటికి ధాన్యం కొట్టుకుపోతున్నది.వర్షం వస్తే రైతులు ఉండడానికి కనీసం నీడ సదుపాయం కూడా ఉండడం లేదు. ఇప్పటికైనా ధాన్యం సేకరణలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలని రైతులు కోరుతున్నారు.
మా బాధను ఎవ్వలు పట్టించుకుంటలేరు. తడిసిన సరుకు కొంటమని చెప్పిండ్రు. మూడుకిలోలు ఎక్కువ పెట్టాలని చెబితే ఆట్ల కూడ వొప్పుకొని ఇచ్చినం. ఇప్పటి వరకు వడ్లను తీసుకుపోతలేరు. ఎందుకు మల్ల మా రైతులను నష్టంచేసేందుకు అధికారులు ఇట్ల చెస్తండ్రు. మేడంకు పోయి కలిస్తే కూడా లారీలు వత్తన్నయి అని చెబుతండ్రు. కానీ, లారీలు వచ్చుడయితలేదు. రోజు ఈడ కావలి ఉండు అయితంది.
– నమిలికొండ రాజయ్య, రైతు, హుస్నాబాద్
నారాయణరావుపేట మారెట్‌కు వడ్లు తెచ్చి పది రోజులు అయ్యింది. అధికారులు ఇంకా వడ్ల కాంటా పెట్టలేదు. అకాల వర్షాల కారణంగా వడ్లు తడుస్తూ మొలకలు వస్తున్నాయి. దయచేసి అధికారులు వడ్లను తొందరగా కొనుగోలు చేయాలి.
– నర్సింలు, రైతు, నారాయణరావుపేట (సిద్దిపేట జిల్లా)
సిద్దిపేట, నవంబర్ 4: నేను సిద్దిపేట వ్యవసాయ మా ర్కెట్ యార్డుకు వడ్లను తెచ్చి 13 రోజులైంది. రోజు వర్షం పడడంతో వడ్లు ఉండటం లేదు. అధికారులు వచ్చి తేమ శాతం రావడం లేదని వడ్లను కొనుగోలు చేస్త్తలేరు.వానల వల్ల కుటుంబం అంతా ఇక్కడనే ఉండాల్సి వస్తున్నది. నేను 3ఎకరాల్లో వరి సాగు చేసిన. పంట పండించిన దాని కంటే అమ్ముకోవడం కష్టంగా మారింది. ఇప్పటికైనా ఆధికారులు తేమ శాతంతో సంబంధం లేకుండా వడ్లను కొనాలి.
– తెల్జీరు మల్లేశం, రైతు, ఇమాంబాద్ (సిద్దిపేట జిల్లా)
మాది అక్కెనపల్లి గ్రామం. నాలుగు రోజుల క్రితం మేము 200 బస్తాల వడ్లు మిల్లుకు పంపించినం. తరుగు ఉందన్న సాకు చూపించి 9 బస్తాలు కటింగ్ చేసిండ్రు. కాళ్ల మీద పడి మొక్కినా కనికరం చూపలేదు. రైతులను ఇంత తిప్పలు పెడుతున్నరు. దయచేసి అధికారులు మా దిక్కు సూడాలే.
– సుకినె యాదవ్వ (మహిళా రైతు, అక్కెనపల్లి)
నంగునూరు, నవంబర్ 4: సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని అక్కెనపల్లి, ఖాతా గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో అకాల వర్షానికి నీట మునిగిన ధాన్యాన్ని మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్‌రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ రాగుల సారయ్యలు మంగళవారం పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులతో మాట్లాడి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలని, రైతులకు ఎకరాకు రూ.25 వేలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, గన్నీ బ్యాగులు, కాంటా చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో నాయకులు బద్దిపడగ కిష్టారెడ్డి, ఉల్లి మల్లయ్య, దశ్వంత్రెడ్డి, నర్సింలుగౌడ్, ఆరెపల్లి రాజయ్య, చెలికాని మల్లేశం, రంగు రాజు, కనకయ్యలు పాల్గొన్నారు.