సిద్దిపేట/ సిద్దిపేట కలెక్టరేట్, డిసెంబరు 19: ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలని సిద్దిపేట కలెక్టర్ మనుచౌదరి అన్నారు. గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఆరోగ్యసేవలు, వైద్యాధికారుల పనితీరుపై కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మనుచౌదరి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతా ల్లో అంధత్వ నివారణ కోసం జిల్లాలోని 26 మండలాల్లో హైదరాబాద్ శంకర కంటి దవాఖాన ఆధ్వర్యంలో క్యాంపు నిర్వహిస్తామన్నారు.
జిల్లాలో సుమారు 3,750 మంది క్యాట్రాక్ట్ సర్జరీలు అవసరమని, ప్రతి మండలంలో వీరందరికీ ప్రతి గురువారం సర్జరీలు నిర్వహిస్తామన్నారు. దవాఖానల్లో ఓపీ /ఐపీ సంఖ్య పెంచాలని, పిల్లలు, గర్భిణులకు వందశాతం వ్యాధి నిరోధక టీకాలు వేయాలన్నారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కార్యక్రమం ద్వారా జిల్లాలో 85శాతం ఓపీ ఉందని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 70శాతం పెంచేందుకు దృష్టి సారించాలని సూచించారు. ఈ – సంజీవనిలో కొన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు వెనకబడి ఉన్నాయని, వాటిపైన దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.
మాతా, శిశు సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా తల్లీబిడ్డలపైన ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. అన్ని ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలని, ప్రతి మంగళవారం ఆరోగ్య మహిళా క్లినిక్‌కు వచ్చే మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ పల్వన్‌కుమార్, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ నారాయణరావు, ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ ఆనంద్, డాక్టర్ అరుణ్‌కుమార్, డాక్టర్ శ్రీకళ, డాక్టర్ శ్రీకాంత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.