రైతులకు ఆధునిక సాగు విధానాలు తెలియజేయడం, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం, ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల గురించి తెలియజేయడానికి వ్యవసాయ క్లస్టర్‌కు ఒకటి చొప్పున కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన రైతు వేదికలు కాంగ్రెస్ పాలనలో నిరాదరణకు గురవుతున్నాయి. రేవంత్ ప్రభుత్వం రెండేండ్లుగా రైతు వేదికల నిర్వహణ కోసం పైసా నిధులు కేటాయించక పోవడంతో నిర్వహణ లేక శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. కేసీఆర్ హయాంలో సమావేశాలతో కళకళలాడిన రైతు వేదికలు, నేడు నిర్వహణ లోపంతో కునారిల్లుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలో చాలా చోట్ల రైతు వేదికల గోడలు బీటలు వారాయి. పైకప్పు రేకులు గాలివానలకు ఎగరిపోయాయి. మెట్లు కుంగిపోయాయి. టాయిలెట్లు దెబ్బతిన్నాయి. చాలా రైతు వేదికల్లో కనీసం టాయిలెట్ల నిర్వహణ సక్రమంగా లేదు. రైతు వేదికల్లో కనీసం తాగునీరు ఉండటం లేదు.
సంగారెడ్డి జూలై 22(నమస్తే తెలంగాణ): రైతుల కోసం కేసీఆర్ సర్కార్ 2020లో సంగారెడ్డి జిల్లాలో ఒక్కోదానికి రూ.22 లక్షల చొప్పున వెచ్చించి 116 రైతు వేదికలు నిర్మించింది. సంగారెడ్డి నియోజకకర్గంలో 16, జహీరాబాద్‌లో 32, నారాయణఖేడ్‌లో 32, అందోల్‌లో 28, పటాన్చెరు నియోజకవర్గంలో 8 రైతు వేదికలు వ్యవసాయ క్లస్టర్ ఆధారంగా నిర్మించింది. కేసీఆర్ హయాంలో రైతు వేదికల్లో క్రమం తప్పకుండా వ్యవసాయాధికారులు రైతులతో సమావేశాలు నిర్వహించేవారు. పంటల సాగు, చీడపీడల నివారణ, రైతు సంక్షేమ పథకాల గురించి అవగాహన కల్పించేవారు. ప్రతి మంగళవారం రైతు నేస్తం పేరుతో రైతులతో సమావేశం నిర్వహించేది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు వేదికల నిర్వహణను గాలికి వదిలేసింది. జిల్లాలో 116 రైతు వేదికలు ఉండగా 50 శాతానికి పైగా రైతు వేదికలు శిథిలావస్థకు చేరుకున్నాయి.
జిల్లా కలెక్టర్, జిల్లా వ్యవసాయాధికారి సహా ఉన్నతాధికారులు సహా హాజరయ్యే సంగారెడ్డిలోని రైతువేదిక నిర్వహణను కూడా ఎవరూ పట్టించుకోవడంలేదు. పోతిరెడ్డిపల్లిలోని రైతు వేదికలో అధికారులు తరచూ సమావేశాలు నిర్వహించడంతోపాటు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, ఇతర ముఖ్య అధికారులు నిర్వహించే వీడియోకాన్ఫరెన్స్లకు జిల్లా, మండల వ్యవసాయశాఖ అధికారులు హాజరవుతారు. ఇతర శాఖల అధికారులు సైతం రైతు వేదికలో సమావేశాలు నిర్వహిస్తారు. పోతిరెడ్డిపల్లి రైతు వేదికలో టాయిలెట్లు సరిగ్గాలేక అధికారులు, సిబ్బంది, రైతులు ఇబ్బంది పడుతున్నారు.

టాయిలెట్ గోడలు బీటలు వారటంతోపాటు లోపల గోడలు దెబ్బతిన్నాయి. రైతు వేదిక ఫ్లోర్ కూడా దెబ్బతింది. కంది రైతు వేదికలో సైతం ఇదే పరిస్థితి ఉంది. కంది రైతు వేదిక అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది. రైతు వేదిక ఎదుటే మందుబాబులు సిట్టింగ్‌లు ఏర్పాటు చేసుకుని మద్యం తాగి బాటిళ్లను అక్కడే వదిలేస్తున్నారు.నాగల్గిద్దలో రైతు వేదిక పైకప్పు రేకులు గాలికి కొట్టుకుపోయాయి. రైతుల ఒత్తిడితో ఇటీవల వాటికి మరమ్మతు చేశారు. సిర్గాపూర్, మునిపల్లి, చౌటకూరు, కంగ్టి, కల్హేర్, నాగల్గిద్ద, అందోల్, పుల్కల్ తదితర మండలాల్లో రైతు వేదికలు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. నిర్వహణలోపంతో రైతు వేదికలు దెబ్బతింటున్నాయని రైతులు వాపోతున్నారు.
రైతు వేదికల వద్ద భద్రత లేక చోరీలు జరుగుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలోని 68 రైతు వేదికల్లో వీడియోకాన్ఫరెన్స్ సౌలభ్యం ఉంది. వ్యవసాయశాఖతోపాటు ఇతర శాఖల అధికారులు రైతు వేదికల్లో వీడియోకాన్ఫరెన్స్లకు హాజరవుతూ ఉంటారు. రైతు వేదికల వద్ద వాచ్మెన్లు లేక వీడియోకాన్ఫరెన్స్ సెట్లు దొంగిలిస్తున్నారు. సంగారెడ్డి సమీపంలోని కంది, డాకూరు, రుద్రారం, నాగల్గిద్ద, అక్సాన్పల్లిలో వీడియోకాన్ఫరెన్స్ సెట్లు, స్పీకర్లు ఎత్తుకుపోయారు. భద్రత లేక రైతు వేదికలు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారుతున్నాయి. రైతు వేదికల వద్ద వాచ్మెన్లు లేక మందుబాబులు రైతు వేదిలోపల మద్యం తాగి సీసాలను అక్కడే వదిలేస్తున్నారు.
రైతు వేదికల నిర్వహణకు కేసీఆర్ ప్రభుత్వం ప్రతినెలా రూ.9వేల నిధులు ఇచ్చేంది. ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ రెండేండ్లుగా రైతు వేదికల నిర్వహణకు నిధులు ఇవ్వడంలేదు. దీంతో ఏఈవోలు సొంత డబ్బులు ఖర్చు చేసి సమావేశాలకు హాజరయ్యే రైతులు, అధికారులకు తాగునీరు, టీ, స్నాక్స్ అందజేస్తున్నారు. రైతు వేదికల నిర్వహణ ఖర్చు మొత్తం ఏఈవోలు భరించాల్సి వస్తుంది. రైతు వేదికల నిర్వహణను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంపై రైతులు, రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. శిథిలావస్థకు చేరుకున్న రైతు వేదికలకు మరమ్మతులు చేయడంతోపాటు నిర్వహణకు నిధులు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.