నంగునూరు, నవంబర్ 4: సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. మిల్లర్ల అరాచకాలు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, అధికారుల నిర్లక్ష్యంతో అన్నదాతలు కన్నీరు పెడుతున్నారు. కాళ్లపై పడి మొక్కినా కనికరించడం లేదని రైతులు వాపోతున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యాన్ని కాంటా చేయడానికి ఆలస్యం చేయడంతో పాటు మిల్లర్లు తరుగు పేరుతో రైతుల నడ్డి విరుస్తున్నారు.
అక్కెనపల్లి గ్రామం నుంచి ఐదు ట్రాక్టర్ల ధాన్యం పంపిస్తే ఏకంగా 40 బస్తాలు కటింగ్ చేసినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తేమ శాతం, రంగు మారిందనే సాకుతో మిల్లర్లు ఇష్టానుసారంగా ఒక్కో ట్రాక్టర్కు 9 నుంచి 10 బస్తాల వరకు కట్ చేస్తున్నారని రైతులు తెలిపారు. ఇదెక్కడి అన్యాయమని గట్టిగా నిలదీస్తే.. మీ వడ్లు మీరే తీసుకెళ్లండని మిల్లర్లు బెదిరిస్తున్నట్లు రైతులు చెప్పారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం స్పందించడం లేదంటున్నారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, పర్యవేక్షణ అధికారులు మిల్లర్లకు వత్తాసు పలుకుతూ ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటున్నారు.