ఉమ్మడి జిల్లాలో ఆత్మీయ సమ్మేళనాలు హోరెత్తుతున్నాయి. గులాబీ పార్టీ దూకుడు పెంచినిత్యం ఏదో ఓ చోట సమావేశాలు నిర్వహిస్తున్నది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల తీయని పిలుపుతో శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొన్నది. సోమవారం హన్వాడ మండలం కొనగట్టుపల్లి-యారోనిపల్లి గ్రామాల మధ్య నిర్వహించిన సమ్మేళనానికి జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డితోపాటు క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హాజరయ్యారు. లంబాడీలు డ్యాన్స్‌లు చేస్తూ అభిమాన నేతలకు ఘన స్వాగతం పలికారు. పార్టీశ్రేణులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధిని ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరించాలని గులాబీ దండుకు పిలుపునిచ్చారు. తొమ్మిదేండ్లలో అభివృద్ధిని పరుగులు పెట్టించిన సీఎం కేసీఆర్‌కు అండగా నిలబడేలా చూడాలన్నారు. అది చేస్తాం.. ఇది చేస్తామని గ్రామాల్లోకి వచ్చే బీజేపీ, కాంగ్రెసోళ్ల కట్టుకథలను నమ్మొద్దని, వారిని నిలదీయాలని సూచించారు. అలాగే అలంపూర్ మండలంలోని లింగనవాయి గ్రామం గులాబీమయమైంది. పార్టీశ్రేణులు భారీగా తరలిరావడంతో సభా ప్రాంగణం జై తెలంగాణ.. జైజై కేసీఆర్ నినాదాలతో మార్మోగింది.
– మహబూబ్‌నగర్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
మహబూబ్‌నగర్, ఏప్రిల్ 10(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేయని వారు ఇప్పుడు అది చేస్తం.. ఇది చేస్తం.. అని చెప్పడానికి వస్తే నిలదీయాలని ప్రజలకు ఆబ్కారీ, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు. హన్వాడ మండలం యారోనిపల్లి గ్రామంలో సోమవారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ.. అక్కడెందుకు సంక్షేమ పథకాలు ఇస్తలేరని అడగాలన్నారు. గతంలో దవాఖానలు ఎలా ఉన్నవి? ఇప్పుడెట్లున్నయో ప్రజలు గమనించాలన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న తెలంగాణ.. ఇప్పుడు కేసీఆర్ నాయకత్వంలో అన్ని రంగాల్లో దూసుకుపోతున్నదన్నారు. కొంతమంది అధికారం కోసం కబుర్లు చెప్పడానికి వస్తున్నారని.. అలాంటి వారిని గ్రామాల్లోనే నిలదీయాలన్నారు.
రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాల అమలుతో గ్రామాలు అభివృద్ధి చెందుతుంటే కండ్లు మండిన ఆ పార్టీలు మేం కూడా అది చేస్తాం.. ఇది చేస్తామని చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. వారు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ఈ పథకాలు ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు. తాము అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో సంక్షేమ ఫలాలు ఇవ్వడం చేతకాని వాళ్లు.. ఇక్కడ ఇస్తామంటే ఎలా నమ్మాలని ప్రశ్నించారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో ఎన్నో పథకాలు అమలవుతున్నాయని.. కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి వాస్తవాలను వివరించాలన్నారు. గ్రామాల్లో ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ ఇంటింటికీ వెళ్లి వారికి ఇంకా అవసరమైన అంశాలను నోట్ చేసుకోవాలన్నారు. పేదవారికి సహాయం చేసేందుకు కార్యకర్తలే సిఫార్సు చేయాలని.. గ్రామాల్లో ఉన్న ఇన్చార్జిలను అడిగి లబ్ధిదారులను ఎంపిక చేస్తామని చెప్పారు. ఇల్లు లేనివారు..జాగా ఉండి ఇల్లు లేని పేదలకు గృహలక్ష్మి పథకం కింద సహాయం చేస్తామన్నారు. పింఛన్లు రాని వాళ్లు.. ఇంకేదైనా అవసరం ఉన్న వారిని గుర్తించి తనకు తెలియజేయాలన్నారు.
హన్వాడ రూపురేఖలు మారుతయ్!
రాబోయే ఏడాది కాలంలో హన్వాడ పాలమూరు మాదిరిగా మారుతుందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. దివిటిపల్లి నుంచి పాలమూరు యూనివర్సిటీ వెనుక భాగం మీదుగా హన్వాడకు బైపాస్‌ను విస్తరిస్తున్నామని.. ఇక్కడి నుంచి బైపాస్ ద్వారా భూత్పూర్, హైదరాబాద్‌కు పది నిమిషాల్లోనే టౌన్‌ను దాటిపోవచ్చన్నారు. ఈ రహదారితో హన్వాడ రూపురేఖలు పూర్తిగా మాపోతాయన్నారు. మహబూబ్‌నగర్-చించోలీ రహదారి పనులు కూడా ప్రారంభమయ్యాయని.. నాలుగు లేన్ల రహదారిని పూర్తిచేస్తే మండలకేంద్రం పట్టణంగా మారుతుందన్నారు. ఇప్పటికే మార్కెట్, మనఊరు-మనబడిలో భాగంగా స్కూల్ భవనం, గ్రంథాలయ భవనానికి శంకుస్థాపన చేస్తామని.. ఇవన్నీ పూర్తయితే హన్వాడ మరోలా ఉంటుందన్నారు. పెద్ద దుకాణాలు, షాపింగ్ కాంప్లెక్స్‌ల ఏర్పాటుతో పాటు భుముల ధరలకు రెక్కలొస్తాయన్నారు. తొందర్లోనే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులు ప్రారంభమై కాలువలు వస్తే సాగునీటికి ఢోకా ఉండదన్నారు.
వేలమందికి ఉద్యోగాలు..
ఏడాదిలోగా దివిటిపల్లి ఐటీపార్కులో అమర్‌రాజా బ్యాటరీ లిథియం గిగాసెల్ ఫ్యాక్టరీ ఏర్పాటుతో నిరుద్యోగ సమస్య తీరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మండలంలోని ఉద్యోగులను ఇక్కడి నుంచే బస్సుల్లో ఎక్కించుకెళ్లి మళ్లీ ఇండ్లకు చేర్చేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. శిక్షణ ఇచ్చి కంపెనీలో శాశ్వత ఉద్యోగాలు కల్పించేలా చర్యలు తీకుంటామన్నారు. మరో నాలుగు కంపెనీలు కూడా సుముఖత చూపుతున్నాయని.. దీంతో నిరుద్యొగ సమస్య ఉండదని స్పష్టం చేశారు. మండలంలోని కొనగట్టుపల్లి జాతీయస్థాయిలో ఉత్తమ పంచాయతీగా ఎంపికైనందున సర్పంచుతోపాటు ఇతర ప్రజాప్రతినిధులు, పంచాయతి సిబ్బందిని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సన్మానించారు. కొనగటుపల్లి అభివృద్ధికి మరిన్ని నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు.
బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని, ప్రతిపక్షాల మాటలను తిప్పికొట్టాలని జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. బతుకులు బాగుపడాలంటే మరోసారి సీఎం కేసీఆర్‌ను గెలిపించాలని సూచించారు. ప్రజలతో పథకాలపై చర్చిస్తూ వారిలో చైతన్యం తీసుకురావాలన్నారు.