పాలమూరు, జూన్ 14 : పాలమూరులోని జెడ్పీ సమావేశ మందిరంలో జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణాసుధాకర్‌రెడ్డి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశాన్ని బీఆర్ఎస్ జెడ్పీటీసీలు వాకౌట్ చేశారు. ఈ సందర్భంగా ముసాపేట జెడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్ మాట్లాడుతూ.. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన స్వర్ణాసుధాకర్‌రెడ్డి అనుభవం, అంకితభావంతో పనిచేస్తారని ఆశించి జెడ్పీ చైర్పర్సన్ పదవికి ఆమోదం తెలిపామన్నారు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన కొద్ది రోజుల్లోనే తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అధికార పార్టీలో చేరడం చాలా బాధకలిగించిందని ఆయన పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్సీ నవీన్కుమార్రెడ్డితోపాటు జెడ్పీటీసీలందరూ సమావేశాన్ని వాకౌట్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. వెంటనే ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి జోక్యం చేసుకొని వాళ్లను మీటింగ్ హాల్‌కు రప్పించగా జెడ్పీ సీఈవో రాఘవేంద్రరావు శాలువాలతో సన్మానించారు. అనంతరం జెడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, బాజీ ఎమ్మెల్యేలు రాజేందర్‌రెడ్డి, మహేశ్వర్‌రెడ్డి తనతో చాలా అభిమానంగా ఉండేవారని గుర్తు చేశారు.
కొందరు మాత్రం తన పదవికి, తనకు ఎలాంటి గౌరవం ఇచ్చేవారు కాదని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై గౌరవంతో పనిచేశానని, తనపై ఎంతో నమ్మకంతోనే జెడ్పీ చైర్పర్సన్ పదవిని కట్టబెట్టినట్లు ఆమె వివరించారు. ఈక్రమంలో ఎన్నో అవమానాలు భరిస్తూ పార్టీ కోసం పనిచేశానన్నారు. గతంలో కేసీఆర్ ఆదేశాల మేరకు మక్తల్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నియోజకవర్గంలో పర్యటించి ప్రచారంలో పాల్గొని అభ్యర్థి విజయానికి కృషి చేశానని గుర్తు చేశారు. అలాంటిది ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో అక్కడ అభ్యర్థి ఓటమికి తానే కారణమని కొందరు తప్పుడు ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్య సమస్యలతో ప్రచారంలో పాల్గొనలేదని వివరించారు. చివరి సమావేశంలో ఇలాంటి ఘటన జరగడం చాలా బాధాకరమన్నారు. సమావేశంలో జెడ్పీ వైస్‌చైర్మన్ యాదయ్య, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.