సాగు సంబురంగా సాగుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో దశాబ్దాలుగా నిరాదరణకు గురైన వ్యవసాయం పూర్వ వైభవాన్ని సంతరించుకున్నది.కరువు నేలలో కృష్ణమ్మ జల పరవళ్లు తొక్కుతున్నది. ఎంజీకేఎల్ఐ ఎత్తిపోతల పథకం.. వర్షాలు సమృద్ధిగా కురవడం.. నిరంతర విద్యుత్‌తో జలం పుష్కలమైంది. రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు నిండుకుండను తలపిస్తున్నాయి. నాడు బీళ్లుగా ఉన్న భూములు నేడు పచ్చని పైర్లతో సస్యశ్యామలంగా కనిపిస్తున్నాయి. దీంతో చెరువులు, బోర్ల కింద యాసంగి వరి నాట్లు జోరందుకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కరిగెట్లు చేస్తుండగా.. మరికొన్ని చోట్ల వరి తుకం పనులు ముమ్మరంగాసాగుతున్నాయి. కొల్లాపూర్ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా వ్యవసాయ పనుల్లో కర్షకులు బిజీబిజీగా ఉన్నారు. ఐదేండ్లుగా గ్రామాల్లో ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి.
కొల్లాపూర్/కోడేరు, జనవరి 5 : దశాబ్దాలపాటు ఉమ్మడి పాలనలో ఉనికి కోల్పోయిన వ్యవసాయం తిరిగి పూర్వ వైభవం సంతరించుకున్నది. రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి వనరులకు పెద్దపీట వేయడంతో వ్యవసాయం పండుగలా మారింది. కృష్ణానదిలో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. కొల్లాపూర్ మండలంలోని ఎల్లూరు రేగుమాన్గడ్డ వద్ద నిర్మించిన ఎంజీకేఎల్ఐ నుంచి నీటిని పంపింగ్ చేస్తునారు. దీంతో ఎల్లూరు, సింగవట్నం, జొన్నలబొగుడ, గుడిపల్లిగట్టు రిజర్వాయర్లు నీటితో తొణికిసలాడుతున్నాయి.
కాల్వల్లో కృష్ణమ్మ పరుగులు పెడుతున్నది. చెరువులు, కుంటలు నిండుకుండలను తలపిస్తున్నాయి. దీంతో యాసంగి సీజన్లో సాగు పనులు జోరందుకున్నాయి. రైతులు పంటల సాగులో మునిగితేలుతున్నారు. ఒక పక్క కరిగెట్లు.. మరో పక్క వరినాట్లతో బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ యాసంగి సీజన్లో కొల్లాపూర్ డివిజన్లోని నాలుగు మండలాల్లో 33 వేల ఎకరాల్లో వరి సాగు చేయనున్నట్లు అధికారుల అంచనా. కొల్లాపూర్ మండలంలో 7,500, కోడేరులో 10 వేలు, పెంట్లవెల్లిలో 2,500, పెద్దకొత్తపల్లిలో 13 వేల ఎకరాలు సాగు చేయనున్నారు.
గత యాసంగిలో 20 వేల ఎకరాలలోపే వరి సాగు కాగా, ఈ సారి అదనంగా 13 వేల ఎకరాలు సాగవుతున్నది. గతేడాది వరికి ప్రత్యామ్నాయంగా పెసర, మినుములు, నువ్వులు, ఉల్లి సాగు చేయగా, తెగుళ్ల కారణంగా రైతులు తీవ్ర నష్టాల పాలయ్యారు. దీంతో ఈసారి జోరుగా వరి నాట్లు పెడుతున్నారు. తరి పొలాలు అధికంగా ఉన్న రైతులు ట్రాక్టర్లతో.. చిన్నకారు రైతులు కాడెడ్లతో కరిగెట్లు చేస్తున్నారు. సింగవట్నం శ్రీవారిసముద్రం రిజర్వాయర్ కింద వానకాలంలో సుమారు 3 వేల పైచిలుకు ఎకరాల్లో రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారు.
కాగా, యాసంగి సీజన్లో రిజర్వాయర్ ఆయకట్టు కింద ఉన్న ఎనిమిది గ్రామాల రైతులు వరి తుకాలు పెట్టారు. కాల్వలు, చెరువులు, కుంటలు, బోరుబావుల్లో పుష్కలంగా నీరు ఉండడంతోపాటు సర్కార్ నిరంతర ఉచిత విద్యుత్ ఇస్తుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా పెట్టుబడి కింద రైతుబంధు డబ్బులు ఖాతాలో జమచేయడంతో రైతుల మోములో ఆనందం వెల్లివిరుస్తున్నది.
40 చెరువులకు జలకళ..
కొల్లాపూర్ నియోజకవర్గంలోని 50 నోటిఫైడ్ చెరువులకుగానూ 40 చెరువులను ఎంజీకేఎల్ఐ కింద నీటితో నింపారు. కోడేరు మండలంలో 7, కొల్లాపూర్‌లో 11, పెద్దకొత్తపల్లిలో 12, పాన్గల్లో 10 చెరువులు, అలాగే వీపనగండ్ల, చిన్నంబావి, పెంట్లవెల్లి మండలాల్లోని చెరువులనూ జూరాల, బీమా, ఎంజీకేఎల్ఐ కింద నీటితో నింపారు. చెరువులు నిండుకుండలను తలపిస్తుండడంతో బోరుబావుల్లో భూగర్బజలాలు పెరిగాయి.