వనపర్తి, మార్చి 22 (నమస్తే తెలంగాణ) : యాసంగిలో సాగు చేసిన రైతులు అయోమయంలో పడిపోయారు. బోరుబావులపై ఆధారపడి పంటలు సాగు చేయగా, భూగర్భజలాలు అడుగంటి నీళ్లు రాకపోవడంతో దిక్కుతోచని పరిస్థితి నెలకొన్నది. ఒక్క నాగవరం తండాలోనే పక్షం రోజుల్లో 20బోర్లు నిలిచిపోయాయంటే వేసవి ప్రతాపం ఎలా ఉందో ఇట్టే తెలుసుకోవచ్చు. అకస్మాత్తుగా భూగర్భజలాలు ఇంకిపోవడంతో బోర్లన్నీ పాతాళానికి పడిపోయాయి.
వనపర్తి మండలం నాగవరం తండాలో రైతులంతా అధికంగా బోరుబావులపై ఆధారపడి సేద్యం చేస్తున్నారు. వీరికి చెరువుల కింద సేద్యం చాలా తక్కువ. రాజనగరం అమ్మచెరువు నిండితే అక్కడి నుంచి అలుగులో వచ్చే నీరు రాజాపేట చెరువుకు తండా రైతుల పొలాల్లోని ఓడికల ద్వారా నీళ్లు వెళ్తాయి. ఈ వనరు తప్పా మరొక నీటి వసతి లేదు. రాజనగరం చెరువుకు వనపర్తి పట్టణ మురుగు కాల్వల నీరంతా చేరి నిండుగా ఉంటుంది. వానకాలంలో అంతంత మాత్రమే పంటలు పండించిన ఇక్కడి రైతులు వర్షాలు బాగా కురియడంతో యాసంగి సాగుపై దృష్టి పెట్టారు. వరితోపాటు జొన్న, తైదలు, వేరుశనగ సాగు చేశారు. కాగా, 15 రోజులుగా నీటి వసతి లేకపోవడంతో పంటలు ఎండుముఖం పట్టాయి.
పక్షం రోజుల్లోనే తండా పరిధిలోని 25మంది రైతుల బోర్లు అకస్మాత్తుగా తగ్గిపోవడం గిరిజన రైతులను అందోళనకు గురిచేస్తున్నది. పంటచేతికొచ్చే దశలో ఇలా బోర్లు తగ్గడంతో రైతులంతా అయోమయంలో పడ్డారు. తగ్గిన బోర్లన్నీ ప్రధాన రోడ్డును అనుసరించి ఉండగా, మరికొన్ని పెదమాల ప్రాంతంలో ఉన్నాయి. ఎండిన బోర్ల రైతులు కొందరు అదనపు నీటి వనరులను సమకూర్చుకోగా, మరికొందరు చేసేది లేక పంటలను గొర్రెలకు మేతగా వదిలేశారు.
ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు పోమానాయక్. వనపర్తి మండలం నాగవరం తండా. ఇతడికి సొంతంగా రెండెకరాల పొలం ఉన్నది. ఐదేండ్లుగా మరో మూడెకరాలు కౌలుకు తీసుకొని వరి సాగు చేస్తున్నాడు. ఎప్పటిలాగే ఈ యాసంగి లోనూ కౌలుకు తీసుకున్న పొలంలో వరి సాగు చేశాడు. పొలానికి బోరు ద్వారా నీటి వసతి ఉన్నది. ప్రస్తుతం పొట్ట దశకు పంట చేరుకున్నది. మరో 20 రోజులు నీటి తడులు అందితే పంటచేతికొచ్చేది. మార్చి నెల నుంచి బోరులో నీరు తగ్గింది. దీంతో ఎకరా పంట నీరందక ఎండిపోయింది. గొర్రెలకు మేతగా ఇచ్చాడు. ఉన్న పొలానికి నీరందడం లేదు. చేతికొచ్చిన పంట కండ్ల ముందే ఎండిపోతుండ డంతో పొలాన్ని చూస్తూ దుఖఃసాగరంలో మునుగు తున్నారు. రూ.లక్ష పెట్టుబడి పెట్టి చేసిన కష్టం గాలిలో కలిసిపోయిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు.
పోమానాయక్, జానానాయక్, నెహ్రూనాయక్, జగన్, అమృనాయక్, హేమ్లానాయక్, లాలునాయక్, బాబునాయక్, జగన్, సబావత్ లాలు, కిషన్, శాంతమ్మ, ఎం.సుధాకర్, వెంకటేశ్, మణ్యంనాయక్, హన్మంతునాయక్, బిచ్చానాయక్, చిన్నమణ్యం, తీరానాయక్, రమేశ్, రొట్టెల మణ్యం, తిరుపతయ్య, గొల్ల నాగన్న బోర్లు పక్షం రోజుల్లోనే తగ్గిపోయాయి.