నెట్వర్క్ మహబూబ్‌నగర్, ఏప్రిల్ 7 : యాసంగి పంటలకు సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వేసవిలో సాగు, తాగునీటి ఎద్దడి తీవ్రమైంది. చెరువులు, కుంటలు అడుగంటగా.. కాల్వలు నీళ్లులేక వెలవెలబోతున్నాయి. బోరుబావుల్లో భూగర్భ జలాలు గణనీయంగా పడిపోయాయి. దీనికి తోడు పలు చోట్ల కరెంట్ సమస్యలు వేధిస్తుండడంతో రైతుల బాధలు వర్ణణాతీతం. రెక్కలు ముక్కలు చేసుకొని..వేల రూపాయాలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంటలు కండ్ల ముందే తడారుతుంటే చూసిన కర్షకుల గుండె బరువెక్కుతున్నది.
చారకొండ, ఏప్రిల్ 7 : మండల కేంద్రానికి చెందిన రైతు గుండె శ్రీనుగౌడ్ తనకున్న రెండెకరాలలో వరి పంట సాగు చేశాడు. పంట బాగా పెరిగే సమయానికి భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. దీంతో ఉన్న బోరులో నీటిమట్టం గణనీయంగా తగ్గిపోయింది. గతంలో రెండు పంటలు సా గుచేసేటోడిని.. ఈ ఏడాది వరి మాత్రమే సాగు చేసినా నీళ్లు అందుతలేవు. ప్రస్తుతం వరి పొట్ట దశలో ఉండగా.. నీళ్లులేక ఎకరం ఎండిపోయింది. మిగిలిన పంటను కాపాడుకునేందుకు నిత్యం మూడు ట్యాంకర్ల వరకు నీటిని తెచ్చి పంటకు నీరందిస్తున్నాడు. ఒక్కో ట్యాంకర్‌కు రూ.1500 వరకు కొనుగోలు చేయాల్సి వస్తుందని సదరు రైతు వాపోతున్నాడు. ప్రభుత్వం స్పందించి నష్టపోయిన పంట వివరాలు సేకరించి పరిహారం ఇచ్చి ఆదుకోవాలని కోరారు.
ధన్వాడ, ఏప్రిల్ 7 : మణిపూర్ తండాకు చెందిన రైతు టీక్యా నాయక్ తన పొలంతోపాటు అప్పంపల్లికి చెందిన మరో రైతు రామకృష్ణారెడ్డికి చెందిన 8 ఎకరాలను కౌలు తీసుకొని వరి సాగు చేశాడు. మరో 10 రోజుల్లో పంటలు చేతికొచ్చే దశలో ఉండగా.. మూడు బోర్లలో నీళ్లు రావడం లేదు. ఒక్కసారిగా భూగర్భ జలాలు అడుగంటడంతో సాగునీరు అందని పరిస్థితులు తలెత్తాయని రైతు లబోదిబోమంటున్నాడు. కౌలుకు ఎకరాకు రూ.10వేలతోపాటు పంట పెట్టుబడికి రూ.6 లక్షల వరకు నష్టపోయినట్లు వాపోయారు. పంటను కాపాడుకునేందుకు సొంతంగా బోరువేసినా చుక్క నీరు పడలేదన్నాడు. గతేడాది బోర్లలో నీరు పుష్కలంగా ఉండేదని, ఈసారి సాగునీటి కష్టాలు మొదలయ్యాయని ఆందోళన చెందాడు. నాకు రుణమాఫీ కూడా కాలేదని బోరుమన్నాడు.
గండీడ్, ఏప్రిల్ 7 : భూగర్భ జలాలు అడుగంటుతుండడంతో రైతుల ఆశలు ఆవిరవుతున్నాయి. దీంతో యాసంగిలో సాగైన పంటలకు గడ్డుకాలం దాపురించింది. గండీడ్ మండలంలోని 27 గ్రామాలలో దాదాపు 7,200 ఎకరాలలో వరి పంటలు సాగయ్యాయి. అయితే జలం పాతాళానికి పడిపోవడంతో సాగునీటికి ఢోకా ఏర్పడింది. దాదాపు 20 మీటర్ల లోతుకు నీటిమట్టం పడిపోయినట్లు అంచనా.. బోరుబావులు వట్టిబోయి నీళ్లు అందక దాదాపు 200 పైచిలుకు ఎకరాల్లో వరి ఎండిపోయింది. మండలంలోని వెన్నాచేడ్, సాలార్‌నగర్ ప్రాజెక్టులతో పాటు 10 నోటిఫైడ్ చెరువులు ఉన్నాయి.
అయితే అన్ని గ్రామాలలో దాదాపు 10 నుంచి 20 ఎకరాల వరకు పంటలు ఎండిపోయినట్లు తెలుస్తున్నది. అయితే వ్యవసాయ అధికారుల లెక్కలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. వరి 7,200 ఎకరాల్లో ఉండగా.. కేవలం 85 ఎకరాలు మాత్రమే ఎండిపోయిందని వారు చెబుతున్నారు. ఇలా తప్పుడు లెక్కలు చూపడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతుకు కన్నీటి కష్టాలు మొదలయ్యాయి. గతేడాది కంటే ఈసారి ఫిబ్రవరి మొదట వారంలోనే భూగర్భ జలాలు ఇంకిపోయాయి. రోజురోజుకూ గణనీయంగా పడిపోతుండడంతో రైతులు కొత్తగా బోర్లు డ్రిల్లింగ్ చేయిస్తున్నా.. ఎక్కడో ఒక చోట మాత్రమే నీళ్లు పడ్తున్నాయి. నీళ్లు అందక ఎండిపోయిన పంటను చేసేది లేక పశువులకు మేతగా వదిలేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందించాలని పలు వురు రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
హన్వాడ, ఏప్రిల్ 7 : భూగర్భ జలాలు ఇంకిపోయి పంటలు చేతికొచ్చే సమయంలో పంటలు ఎండిపోతుంటే రైతు గుండె తరుక్కుపోతున్నది. పంటలను ఎలాగైనా కాపాడుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండల కేంద్రం శివారులో రైతులు శ్రీనివాసులు, అక్భరయ్య, బాలయ్యకు చెందిన వరి పంట ఎండుముఖం పట్టింది. మరో 15 రోజుల్లో కోతకొచ్చే సమయంలో సాగునీరు లేకపోవడంతో పంటను కాపాడుకోవడానికి రైతు శ్రీనివాస్ ట్యాంకర్ ద్వారా నీటిని అందిస్తునానడు. ఒక్క వాటర్ ట్యాంకర్‌కు రూ.600 చెల్లించి చెల్లించి రోజుకు నాలుగు నుంచి ఆరు ట్రిప్పుల నీళ్లు పంటకు పారబెడుతున్నాడు.
పెబ్బేరు, ఏప్రిల్ 7 : జూరాల ప్రధాన ఎడమ కాల్వ పరిధిలో సాగుచేసిన యాసంగి పంటలకు సంకట స్థితి తలెత్తింది. వరి పంట చివరి దశలో ఉండగా.. నీరందని పరిస్థితి ఏర్పడింది. మరో రెండు, మూడు తడులకు నీరు అవసరముండగా.. అప్పుడే కాల్వలో నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎలాగైనా పంటలను గట్టెక్కించాలన్న తాపత్రయంతో కొందరు రైతులు భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు. మండలంలోని తోమాలపల్లె వద్ద జూరాల ప్రధాన ఎడమ కాల్వ నీరు లేక వెలవెలబోతున్నది. అడుగు భాగాన ఉన్న కొద్దిపాటి నీటిని పారించేందుకు రైతులు తండ్లాడుతున్నారు. ఓ ట్రాక్టర్‌కు మోటార్లు బిగించి పైపుల ద్వారా పంట కాల్వలకు తోడి పోస్తున్నారు.