జడ్చర్ల, జూలై 11 : మంచినీటి కోసం గ్రా మపంచాయతీ కార్యాలయం ఎదుట మహిళలు నిరసన తెలిపిన ఘటన జడ్చర్ల మండలంలోని పోలేపల్లిలో శుక్రవారం చోటుచేసుకున్నది. కొన్నాళ్లుగా తాగునీళ్లు రావడం లేదని, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మహిళలు వాపోయారు. వంట చేయడానికి ఇబ్బంది కలుగుతుందన్నారు.
మూడు నెలలుగా వారానికి ఒకరోజు నీళ్లు వదులుతున్నారని, చాలీచాలని నీళ్లతో ఇబ్బందులు పడుతుంటే నాలుగు రోజులుగా పూర్తిగా నీళ్లు బంద్ కావడంతో చాలా ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఈ విషయమై ఎంపీడీవో విజయకుమార్‌ను వివరణ కోరగా మండలంలోని బండమీదిపల్లి వద్ద మిషన్ భగీరథ పైప్‌లైన్ మరమ్మతుల కారణంగా మూడు రోజులుగా నీటి సరఫరా నిలిచిపోయిందని తెలిపారు. పైప్‌లైన్ మరమ్మతు చేశాక నీటి సరఫరా చేస్తామని తెలిపారు. అలాగే గ్రామంలోని బోరుబావులకు సంబంధించిన మోటర్ కూడా కాలిపోయిందని, బాగు చేయిస్తున్నట్లు తెలిపారు.