Wanaparthy: వనపర్తి జిల్లా రేవల్లి మండలంలోని నాగపూర్లో దారుణం చోటుచేసుకుంది. ఇంట్లో నిత్యం గులుగుతూ తనను సతాయిస్తున్నదంటూ వృద్ధురాలైన అత్తను ఓ కోడలు రాడ్డుతో కొట్టి చంపేసింది. నాగపూర్ గ్రామానికి చెందిన ఎల్లమ్మ (73), దసరయ్య దంపతులకు నలుగురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. ఎల్లమ్మ భర్త దసరయ్య మృతిచెందడంతో కుమారుడు మల్లయ్య వద్ద ఉంటున్నది. ఈ క్రమంలో కోడలు బొగురమ్మతో ఆమె తరచూ గొడవ పడేంది. దీంతో విసిగిపోయిన ఆమె ఆదివారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఎల్లమ్మను ఇనుప రాడ్డుతో బలంగా కొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే మృతిచెందింది.
స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితురాలిని అరెస్ట్ చేశారు. తనను ఇబ్బందులకు గురిచేస్తుండటంతో తానే చంపానని బొగురమ్మ పోలీసులకు తెలిపింది. ఈ ఘటనపై ఎల్లమ్మ రెండో కూతురు బచ్చమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.