నవాబ్‌పేట, ఫిబ్రవరి 26 : నేను తీసుకున్న పంటరుణాన్ని ప్రభుత్వం మాఫీ చేయలేదు..అలాగే ఆరునెలలకోసారి రావాల్సిన పంట పెట్టుబడి డబ్బులు పడలేదు..చేసేది లేక వ్యవసాయాన్ని బంద్ చేసి.. పొలాన్ని బీడుపెట్టానని వాపోయాడు నవాబ్‌పేట మండలంలోని హజిలాపూర్ గ్రామానికి చెందిన రైతు నర్సింగ్‌రావు. ఆయన కథనం ప్రకారం నా కున్న 9ఎకరాల పొలంలో దశాబ్దాల కాలంగా పంట లు సాగు చేస్తూ..మంచి పంటలు పండిస్తున్నాను. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఎనిమిదేండ్లపాటు నాకు క్రమం తప్పకుండా రైతు బంధు డబ్బులు పడ్డాయి. ఆడబ్బులతోనే పంటలు పండించాను.
ఆ పంటలు అమ్మిన డబ్బులతో ఇల్లు కట్టుకొని, బిడ్డ పెండ్లి కూడా చేశాను. కాగా గతేడాది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి నాకు ఎలాంటి సాయం అందలేదు. నా పేరున లక్షా 86వేల రూపాయాల పంట రుణం ఉన్నది..ఇటీవల ప్రభుత్వం చేపట్టిన రుణమాఫీలో నాకు మాఫీ కాలేదు. రుణమాఫీ కోసం గతంలో అనేక పర్యాయాలు అధికారుల చుట్టూ తిరిగాను. లేనిపోని సా కులు చెప్పి తిప్పి ఇంటికి పంపారు. అలాగే ఇప్పటి వరకు రైతు భరోసా డబ్బులు కూడా రాలేవు. గతంలో పండించిన వరి ధాన్యానికి ధర లేదని వాటిని విక్రయించలేదు.
బోనస్ వేస్తామని చెప్తే నమ్మకం లేక ధాన్యం అమ్మలేను..వడ్లు నా ఇంటి ఆవరణలోనే అలాగే ఉన్నాయి. పంటలు సాగు చేయాలంటే లక్షలు రూపాయలు కావాలి. నేను ప్రస్తుతం అప్పులు తెచ్చే పరిస్థితుల్లో లేను. అందుకే ఉన్న 9ఎకరాల పొలాన్ని పడావు వేశాను. 20ఏండ్ల నుంచి ఎప్పుడు కూడా పడావు పెట్టలేను..పొలం వద్దకు వెళ్తే బాధేస్తున్నది. కానీ ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడ్డదని రైతు నర్సింగ్‌రావు ఆవేదన వ్యక్తం చేస్తూ..తన మనోగతాన్ని వెల్లడించాడు.