అమరచింత, మే 22 : సీఎం రేవంత్‌రెడ్డి నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతలకు డీపీఆర్ లేకుండా పనులు ప్రారంభించడాన్ని చూస్తుంటే కమీషన్ల కోసమేనని వెల్లడవుతుందని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి విమర్శించారు. గురువారం అమరచింతలోని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రాజేందర్‌సింగ్ నివాసంలో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మక్తల్ నియోజకవర్గంలోని రైతుల భూములకు సాగునీరు అందించేందుకు దివంగత చిట్టెం నర్సిరెడ్డి నిరంతరం కృషి చేసి భీమా ప్రాజెక్టు నిర్మాణం కోసం పని చేశారని, ఈ ప్రాంత రైతుల ప్రయోజనాలను విస్మరించి భూత్పూర్ కెనాల్ నుంచి కొడంగల్ రైతులకు నీటిని తరలిస్తామంటే ఊరుకోమని హెచ్చరించారు.
పదేండ్ల కేసీఆర్ పాలనలో రాష్ర్టాన్ని దేశంలోనే మొదటి స్థానంలో నిలబెట్టగా, కాం గ్రెస్ ఏడాదిన్నరలోనే 20ఏండ్ల అభివృద్ధి వెనక్కి నెట్టిందన్నారు. భూత్పూర్ కెనాల్ ద్వారా మక్తల్, నర్వ, అమరచింత, ఆత్మకూర్ మండలాల్లోని వివిధ గ్రామాల చెరువులకు సాగునీటిని వదిలి రైతులు ఏడాదికి రెండు పంటలు సాగు చేసుకుంటుంన్నారని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి ఈ ప్రాంత రైతుల నోట్లో మట్టి కొట్టి ఇక్కడి నుంచి కొడంగల్ ఎత్తిపోతలకు నీటిని తరలిస్తామంటే ఎవరూ ఒప్పుకోరన్నారు. సొంత నియోజకవర్గంలోని రైతులపై సీఎంకు ప్రేముంటే కొడంగల్ పక్కనే అందుబాటులో ఉన్న సాగునీటిని తీసుకురావాలని సూచించారు.
మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి సీఎం మెప్పు కోసం కొడంగల్ ఎత్తిపోతల పూర్తయితే ఊట్కూర్ మండలంలో 30ఎకరాల భూమి సాగులోకి వస్తుందని ప్రగల్బాలు పలుకుతున్నారని, భూ త్పూర్ కెనాల్ నుంచి 4టీఎంసీల నీటిని తరలిస్తే నర్వ, అమరచింత, ఆత్మకూర్ మండలాల్లోని వేల ఎకరాల సా గుభూములు బీడుగా మరుతాయన్న విషయం ఎందుకు మరిచారని ప్రశ్నించారు. స్వార్థ రాజకీయాల కోసం రైతుల కడుపు కొడితే సహించేది లేదన్నారు.
ఇప్పటికే 90శాతం పనులు పూర్తయిన పాలమూరు ఎత్తిపోతల పథకం పనులను గాలికొదిలేసి కమీషన్ల కోసం ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండానే కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని తీసుకొచ్చిన రేవంత్‌రెడ్డికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి సాగునీటి ప్రాజెక్టులపై అవగాహన లేక కొందరి కోసం అందరికీ అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు.
గ్యారెంటీలన్నీ గాలికొదిలేసి కేసీఆర్‌పై ఆరోపణలు చేస్తూ ఇంకెంత కాలం పబ్బం గడుపుతారని నిలదీశారు. సమావేశంలో అమరచింత మున్సిపల్ మాజీ చైర్పర్సన్ మంగమ్మ, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాజు, నాగభూషణంగౌడ్, ఆత్మకూర్, అమరచింత మండలాల బీఆర్ఎస్ అధ్యక్షుడు రవికుమార్‌యాదవ్, రమేశ్, మున్సిపల్ మాజీ కోఆప్షన్ సభ్యుడు రియాజ్అలీ, చిన్నబాల్రాజు, రవి పాల్గొన్నారు.