నారాయణపేట : జిల్లాల పునర్వ్యవస్థీకరణ పేరుతో నారాయణపేట జిల్లాను ( Narayanpet district ) తొలగిస్తే సహించేది లేదని మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ ( MP DK Aruna ) కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాను రద్దు చేస్తే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమయ్యిందని ఆరోపించారు.
మహిళలకు రూ. 2,500 ఆర్థిక భరోసా, వృద్ధులు, వికలాంగుల, ఒంటరి మహిళల పెన్షన్లు పెంచలేదని విమర్శించారు .మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రజలను మభ్య పెట్టేందుకు మరోసారి మోసపూరిత హామీలు ఇస్తున్నారని దుయ్యబట్టారు.ఎన్నికలు వస్తున్న సమయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు హడావిడిగా శంకుస్థాపనలు చేస్తున్నారని ఆరోపించారు.పట్టణ ప్రజలు మరోసారి కాంగ్రెస్ మాటలు నమ్మవద్దని ఆమె కోరారు.
అమృత్ పథకానికి నిధులు ఎక్కడినుంచి వస్తున్నాయో కూడా అవగాహన లేకుండా మంత్రులు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.ఎంపీగా తనకు ప్రోటోకాల్ ఇవ్వడంలేదని, కనీస సమాచారం అందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.కేంద్రం ఇస్తున్న నిధులను, రాష్ట్ర ప్రభుత్వ నిధులు అని కక్కుర్తికి పాల్పడుతుందని ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.