వనపర్తి టౌన్, మార్చి 7 : అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భార్య భర్తను చంపిన కేసును పోలీసులు చేధించారు. శుక్రవారం సీఐ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు కేసు వివరాలను వెల్లడించారు. పాన్‌గల్ గ్రామానికి చెందిన ఎండీ పర్వీన్బేగానికి 12 యేండ్ల కిందట కర్నూల్‌కు చెందిన ఎండీ రెహ్మతుల్లా (44)తో వివాహమైంది. వారికి ఒక అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. పళ్లైన రెండేండ్లు కర్నూలు పట్టణంలో కాపురం చేసి వారిద్దరి మధ్య గొడవలు రావడంతో పదేండ్ల కిందటే భార్యాభర్తలు ఇద్దరు పిల్లలతో కలిసి పర్వీన్‌బేగం తమ తల్లిగారి గ్రామమైన పాన్‌గల్ సంతబజారులో అద్దెఇంట్లో జీవనం కొనసాగిస్తున్నారు.
తన భర్త పెయింటింగ్, మటన్ కటింగ్ చేస్తూ సంతబజారులో నివాసం ఉంటున్నారు. పర్విన్బే గం టైలరింగ్ నేర్చుకుంటుండగా కిరాణం షాపు నడుపుతున్న కుమ్మరి రాఘవేంద్రతో పరిచయమై అక్రమ సంబంధానికి దారితీసింది. రాఘవేంద్రను తరుచుగా ఇంటికి పిలిచేది. ఒక దశలో వారిద్దరిని భర్త రెహ్మతుల్లా చూసి పట్టుకొని దాడిచేసి పెద్దల సమక్షంలో రాజీ కుదుర్చుకున్నారు. అక్రమ సంబంధాన్ని మనసులో పెట్టుకున్న రెహ్మతుల్లా తరుచుగా భార్య పర్విన్ బేగంతో గొడవలు పెట్టుకునేవాడని, ఇతను బతికి ఉన్నన్నాళ్లు తనకు ఇబ్బందులు తప్పవని భావించి రెహ్మతుల్లాను అంతమొందించేందుకు పర్విన్‌బేగం నిర్ణయించుకుందని చెప్పారు.
రాఘవేందర్ కు పరిచయం ఉన్న కురుమూర్తితో విషయాలు వెల్లడించి రాఘవేంద్రకు ఇవ్వాల్సిన డబ్బులు మాఫీ చేస్తానని కురుమూర్తితో ఒప్పందం కుదుర్చుకొని పథకం ప్రకారం మా ర్చి 1న 4 గంటల సమయంలో రాఘవేందర్, కురుమూర్తిలను ఇంటికి పిలిపించి గొర్రెను కోసేది ఉందని చెప్పి ప్రభుత్వ జూనియర్ కళాశాల కేఎల్ఐ కాలువ దగ్గరికి తీసుకెళ్లి అతని తలపై ఉన్న చేతిరుమాలుతో గొంతుకు బిగించారు. అతను అరుపులు చేస్తుండగా కురుమూర్తి చేతులు పట్టుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత రెహ్మతుల్లా ఊపిరాడక మృతి చెందాడు.
ఎవరికీ అనుమానం రాకుండా ఉండాలని రెహ్మతుల్లా శవాన్ని, అతని వెంట తెచ్చుకున్న కత్తిని కేఎల్ఐ కాలువలో పడవేసి రక్తపు మరకలు అంటిన చేతిరుమాలును చీకటి కావడంతో అక్క డే వదిలివేసి వెళ్లారు. రెహ్మతుల్లా కాల్వలో పడి చనిపోయాడని అనుకునేవిధంగా అతని చెప్పు లు, టోపి తీసి కాల్వలో పడవేసి రాఘవేంద్ర, కురుమూర్తి మోటర్ సైకిల్‌పై వెళ్లిపోయారని చెప్పారు. చేతిరుమాలు ఆధారంగా ఈ కేసును ఛేదించడంలో ప్రతిభను చూ పిన సీఐ కృష్ణ, ఎస్సై శ్రీనివాసులును, శిక్షణ ఎస్సై హిమబిందు, సిబ్బంది నరేశ్, గోపాల్, దివ్యరెడ్డి, పోలీస్ బృం దాన్ని డీఎస్పీ అభినందించారు.