గద్వాల, మార్చి 26 : కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలన వల్లే ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టుల కింద పంటలు ఎండుతున్నాయని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం నెట్టెంపాడ్ ప్రాజెక్టు పరిధిలోని ర్యాలంపాడ్ రిజర్వాయర్ 104 ప్యాకేజీ కింద కేటీదొడ్డి మండలంలోని కొండాపురం, వెంకటాపురం, ఉమిత్యాల, గువ్వలదిన్నె గ్రామాల్లో ఎండిన పంటలను గద్వాల నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు బాసు హనుమంతునాయుడు, నాగర్‌దొడ్డి వెంకట్రాములు, విష్ణువర్ధన్‌రెడ్డి, అంగడి బస్వరాజ్తో కలిసి మాజీ మంత్రి పరిశీలించి రైతులతో మాట్లాడా రు.
వెంకటాపురం శివారులో రైతు ఎల్లప్ప తొమ్మిది ఎకరాల వరి పంట సాగు చేయగా పంట మొత్తం ఎండిపోగా ఆ రైతు పొలాన్ని మాజీ మంత్రి పరిశీలించారు. రైతుతో మాట్లాడి నష్ట వివరాలను అడిగి తెలుసుకొని రైతుకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రైతులతో మాట్లాడే సమయంలో అక్కడే ఉన్న మహిళా రైతులు మాజీ మంత్రిని కలిశారు. గతంలో ఎప్పుడు ఇలా పంటలు ఎండలేదని ఈ ఏడాది సక్రమంగా నీరు ఇవ్వకపోవడంతో పంటలు ఎండి పోయాయని మాజీ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
అక్కడ నుం చే ఆయన కలెక్టర్ సంతోష్, ఇరిగేషన్ ఎస్ఈ రహిమొద్దీన్తో ఫోన్ లో మాట్లాడి కర్ణాటక ప్రభుత్వానికి మన రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఇండెంట్ నీటిని త్వరలో విడుదల చేయించి రైతుల పంటలు కాపాడాలని వారికి సూచించారు. రైతుల ఎండి పోయిన పంట పొలాలకు ఎవరు పరిహారం అందిస్తారని వారిని ప్రశ్నించారు. అనంతరం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రాజెక్టుల కింద రైతులు సాగు చేసిన పంట పొలాలకు సాగునీరు అందక నోటికాడికి వచ్చిన పంటలు ఎండిపోతున్నాయన్నాని ఆవేదన వ్యక్తం చేశా రు.
బోర్ల ద్వారానైనా పంటలను కాపాడుకుందామంటే నాణ్యమైనా విద్యుత్ సరఫరా లేకపోడంతో పంటలు ఎండి పోతున్నాయని చె ప్పారు. ఇక్కడి ఎమ్మెల్యే, అధికారులు చెప్పడం వల్లే రైతులు పం టలు సాగు చేశారని పంటలు ఎండడానికి వారే కారణమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత జిల్లా అని ప్రతిసారి గొప్పగా చె ప్పుకుంటాడని సొంత జిల్లాలో పంటలు ఎండుతుంటే ఆయనకు పట్టదా ? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి తన సీటు కాపాడుకునే పనిలో ఉంటే నీళ్లమంత్రి రైతుల పంటలు ఎండుతున్నా ఏ రోజు ఇరిగేషన్‌శాఖ అధికారులతో సమీక్ష చేయకుండా ముఖ్యమంత్రి సీటుపై కన్నేసి ఉంచాడని ఆరోపించారు.
కేసీఆర్ పదేండ్ల పాలనలో పంటలు బాగా పండితే, రేవంత్ ఏడాదిన్నర పాలనలో పంటలు ఎండుతున్నాయని ఎద్దేవా చేశారు. ప్రజలు, రైతులు నమ్మి ఓటు వేసినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వారి గొంతు కోసిందన్నారు. రైతు బంధు మూడు ఎకరాలకే బంద్ పెట్టాడని, దేవుళ్ల సాక్షిగా రూ. రెండు లక్షల రుణమాఫీ చేస్తానని ఒ ట్టు వేసి మాట చెప్పిన ముఖ్యమంత్రి మాట తప్పాడని ఆరోపించారు. యాసంగిలో రైతులకు సాగునీరు ఇచ్చే సమయంలో ప్రభుత్వం ఐఏబీ సమావేశం ఏర్పాటు చేసి ప్రాజెక్టుల్లో ఉన్న నీటి లభ్యత ఆధారంగా సాగు ప్రణాళిక రూపొందించిన తర్వాత ఆయా ప్రాజెక్టుల కింద సాగు వివరాలు ప్రకటించాలన్నారు.
అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఐఏబీ సమావేశం నిర్వహించకుండా, పంట పొలాలకు నీరు ఇచ్చే క్రమంలో ఒక ప్రణాళిక లేక పోవడం వల్ల ప్రస్తుతం రైతులు సాగు చేసిన వరి పంట ఎండి పోతుందని దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం, అధికారులు రైతులకు సరైనా అవగాహన కల్పించక పోవడం వల్ల ప్రస్తుతం ఈ పరిస్థితి నెల కొందన్నారు. ఇక్కడి ఎమ్మెల్యేలు, జిల్లా మంత్రి కర్ణాటకు వెళ్లి సాగు నీరు అందించాలని కోరినట్లు చెబుతున్నారని అయితే ఈ నీటి విడుదల ఏమైందని ప్రశ్నించారు.
ఆర్డీఎస్కు ఒక టీఎంసీ, నెట్టెంపాడ్ ప్రాజెక్టుకు నాలుగు టీఎంసీల నీటిని విడుదల చేస్తామని కర్ణాటక ప్రభుత్వం అంగీకరించిందని వారు చెప్పారన్నారు. ప్రస్తు తం జూరాల ప్రాజెక్టుకు ఇప్పటి వరకు ఒక్క టీఎంసీ నీరు కూడా పూర్తి స్థాయిలో రాలేదని విమర్శించారు. గత కాంగ్రెస్ పాలకుల నిర్లక్ష్యం కారణంగా ర్యాలంపాడ్ రిజర్వాయర్ లీకేజీ అవుతుందని అందులో నాలుగు టీఎంసీల నీటిని నిలువ చేయాల్సి ఉండగా ప్రస్తుతం రెండు టీఎంసీల నీరు కూడా నిలువ ఉండడం లేదన్నారు.
రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత రహితంగా వ్యవహరస్తుందని ఆరోపించారు. వరంగల్ డిక్లరేషన్‌లో రైతులకు ఇచ్చిన హామీలన్నీ ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రి జూపల్లి కృష్ణారావుకు కక్ష్యలు, కార్పాణ్యాలు తప్పా ఎండుతున్న పంటల విషయంలో పట్టింపు లేదన్నారు. తన మంత్రి పదవి ఉంటుందో ఊడుతుందో తెలియక ఆందోళనలో ఉన్నాడని, ఇక రైతుల గురించి ఏం పట్టించుకుంటాడని ఎద్దేవా చేశారు.
ఆర్డీఎస్ ప్రాజెక్టు పరిధిలో గత 50 ఏండ్లలో ఎప్పుడు ఇంతటీ నీటి తీవ్రత లేదన్నారు. మొదటి డిస్ట్రిబ్యూటర్ దగ్గరకే నీరు రాక పోతే ఇంతటి దౌర్భాగ్య పరిస్థితి ఎమైనా ఉందా అని ప్రశ్నించారు. ఆర్డీఎస్ పరిధిలో రైతులు వివిధ పంటలు 47వేల ఎకరాల్లో సాగు చేశారని ప్రస్తుతం అయిజ మండల పరిధిలో ఆరు వేల ఎకరాల్లో పంట లు ఎండి పోయయాని వీరికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతుల ఉసురు కాంగ్రెస్ ప్రభుత్వానికి తగులు తుందన్నారు.
పది రోజులు నీరు వదిలితే రైతుల పంటలు చేతికి వస్తాయని ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించి కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి నీటిని విడుదల చేయించే విధంగా సీఎం చొరవ తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కుర్వ పల్లయ్య, శ్రీరాములు, మోనేశ్, తిరుమలేశ్, శేఖర్‌నాయుడు, జనార్దన్‌రెడ్డి, రాజు, గోపాల్, వీరేశ్‌గౌడ్, కృష్ణారెడ్డి, రాము డు, రాము, ఆంజనేయులు, సామేలు, కా మేశ్ తదితరులు పాల్గొన్నారు.