అలంపూర్ చౌరస్తా, జనవరి 9: ఆరుగాలం పండించిన పంటలు ఎండుతున్నా.. సాగునీరు విడుదల చేయకుండా ప్రజాపాలన ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్డీఎస్ కాల్వకు సాగునీరు పారక మిర్చి, కంది, మొక్కజొన్న, ఇతర పంటలు ఎండుమొహం పడుతున్నాయి. పంటలు చేతికొచ్చే సమయంలో సాగునీరు విడుదల చేయకపోవడం ఏంటని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆర్డీస్ డీ-30 నుంచి ఉండవల్లి, అలంపూర్ చివరి ఆయకట్టు వరకు కాల్వల్లో సాగునీరు పారకపోవడంతో ఏం చేయాల్లో తెలియక రైతులు లబోదిబోమంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆర్డీఎస్ కాల్వకు సాగునీరు పారించాలని రైతులు కోరారు.