కోడేరు, డిసెంబర్ 6 : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల కోడేరు మండలంలో శుక్రవారం సాయంత్రం కురిసిన ఈదురు గాలులతో కూడిన అకాల వర్షానికి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయ్యింది. వర్షపు నీటి లో కొంత ధాన్యం కొట్టుకుపోవడంతో రైతు లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా కోతకు సిద్ధంగా వరి పంటలు నేలకొరిగి దెబ్బతిన్నాయి. రైతులు ఆరుగాలం కష్టించి పండించిన పంటలు చేతికొచ్చే సమయంలో ప్రకృతి కన్నెర్ర చేయటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
మండలకేంద్రంలోని ధా న్యం కొనుగోలు కేంద్రం వద్ద కోడేరుకు చెం దిన పొడెండ్ల నాగరాజు అనే రైతుకు చెందిన ధాన్యాన్ని శుక్రవారం తూకం వేసిన 54 బస్తాలు ఆరుబయట ఉంచగా వర్షానికి తడిసిపోయింది. అదేవిధంగా కృష్ణయ్య, కు రుమూర్తి అనే రైతుల ధాన్యం తేమశాతం ఎ క్కువగా ఉండటంతో గోదాం వద్ద ఆరబోశా రు. సాయంత్రం అకాల వర్షం కురియడంతో ధా న్యం తడిసి పోవడంతోపాటు వర్షపు నీటిలో కొట్టుకుపోయింది.
దీంతో రైతు కృష్ణయ్య తన భార్య తడిసిన ధాన్యాన్ని చూపుతూ కన్నీటి పర్యంతమయ్యారు. మరో పక్క పంట పొలా ల్లో కోతకు సిద్ధంగా ఉన్న పంటలు చాలా వరకు నేలకొరగడంతో రైతులు ఏం చేయాలో పాలుపొని పరిస్థితి ఏర్పడింది. పంట నీట మునగడంతో గింజలు మొలకెత్తే అవకాశం ఉందని అకాల వర్షంతో పంటలు ఆరబెట్టుకునే పరిస్థితి కూడా లేకుండా పోయిందని వారు వాపోతున్నారు.
ప్రభుత్వం స్పందించి అకాల వర్షానికి తడిసిన ధాన్యానికి, నీటి మునిగిన పంటలకు నష్ట పరిహారం అందించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.