అకాల వర్షం రైతన్నను ఆగమాగం చేసింది. ఆరు నెలల కష్టం ఒక్క అరగంటలో తుడిచిపెట్టేలా
చేసింది. సోమవారం సాయంత్రం గాలివానతో బీభత్సం సృష్టించింది. పలు చోట్ల తీరని నష్టాన్ని
మిగిల్చింది. మహబూబ్‌నగర్ జిల్లా మహ్మదాబాద్ మండలంలో కురిసిన వానతో ధాన్యం తడిసింది.
ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే వరుణదేవుడు ఆగ్రహంతో
రైతులకు తీరని నష్టం ఏర్పడింది. మండలంలోని వెంకట్పల్లి, మహ్మదాబాద్ కొనుగోలు కేంద్రాల్లో
ఉన్న 600 బస్తాల ధాన్యం తడిసి ముద్దయింది.
అలాగే నారాయణపేట జిల్లాలో 3 వేల బస్తాలు తడిసి ముద్దయ్యాయి. ఒక్కసారిగా వచ్చిన వర్షంతో ధాన్యం కుప్పలుగా చేసి కవర్లు కప్పేందుకు యత్నించినా ఫలితం లేకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. తడిచిన ధాన్యం ఏమి చేయాలో పాలుపోక మదనపడుతున్నారు. అలాగే ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు కురిసిన వర్షానికి సైతం పెద్ద ఎత్తున పంటలు దెబ్బతిన్నాయి. అధికారులతోపాటు బీఆర్ఎస్
నాయకులు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ప్రభుత్వ పరంగా నష్టపరిహారం అందించి రైతులను
ఆదుకోవాలని పలువురు డిమాండ్ చేశారు.
– మహబూబ్‌నగర్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
వెంకట్‌రెడ్డిపల్లి కొనుగోలు కేంద్రానికి నేను తీసుకొచ్చిన వడ్లు వర్షం నీళ్లలో కొట్టుకుపోయాయి. తేమ శాతం ఉన్నా బస్తాలు ఇవ్వ లేదు. కొనడానికి చాలా ఆలస్యం చేస్తున్నారు. కష్టపడి పండించిన పంట నీళ్లలో కొట్టుకుపోతుంటే కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఒక్కడినే వర్షంలో వడ్లు నానకుండా కాపాడుకునే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది.
– చాకలి బసయ్య, కంచన్‌పల్లి