నారాయణపేట టౌన్, డిసెంబర్ 5 : అకాల వర్షానికి మార్కెట్లోని ధాన్యం తడిచింది. గురువారం నారాయణపేట జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్కు మొత్తం 4,331 బస్తాల ధాన్యాన్ని విక్రయించేందుకు సమీప గ్రామాలకు చెందిన రైతులు తీసుకొచ్చారు. అయితే మధ్యాహ్నం ఒక్కసారిగా వాన రావడంతో కర్షకులు టార్పాలిన్ కవర్లు ధాన్యంపై కప్పేలోగా చాలా వరకు తడిసిపోయింది.
రైతులకు చెందిన 20 బస్తాలు, ఖరీదుదారులకు సంబంధించి 400 బస్తాలు తడిసింది. వర్షం తగ్గాక కొట్టుకుపోతున్న ధాన్యా న్ని రైతులు సేకరించి ఒక్కచోటుకు చేర్చారు. ఆరుగాలం కష్టించి పండించిన పంట నీటిపాలవడంతో రైతన్న గుండె తరుక్కుపోయింది. మరికొందరు కవర్లు కప్పి తడవకుండా కాపాడుకున్నారు.
అకాల వర్షాల నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో శుక్రవారం ధాన్యం కొనుగోళ్లను నిలిపివేస్తున్నట్లు ఏఎంసీ చైర్మన్ శివారెడ్డి తెలిపారు. మార్కెట్లో తడిసిన ధాన్యాన్ని గురువారం ఆయన పరిశీలించారు. టెండర్లు వేసిన ధాన్యానికి తూకాలు వేస్తామని, మార్కెట్కు ఎవరూ ధాన్యం తేవొద్దని సూచించారు. కందుల కొనుగోళ్లు మా త్రం యథావిధిగా కొనసాగుతాయని చెప్పా రు. ఆయన వెంట డైరెక్టర్ శరనప్ప, సెక్రటరీ భారతి, సూపర్వైజర్ లక్ష్మణ్, రైతులు ఉన్నారు.