నాగర్కర్నూల్ రూరల్, మే 10 : అకాల వర్షానికి నాగర్కర్నూల్ జిల్లా కేంద్రం నెల్లికొండగేట్ సమీపంలోని వ్య వసాయ మార్కెట్లో రైతులు ఆరబోసుకున్న మక్కలు తడిసి ముద్దయిపోయింది. పగలంతా నిప్పుల కొలిమిలా ఉన్న వాతావరణం ఆదివారం సాయంత్రం 5 గంటల తర్వాత ఒక్కసారిగా మార్పులు చెంది, భారీ వర్షం కురవడంతో దిక్కుతోచని స్థితిలో ఆందోళన చెందిన రైతులు విలవిల్లాడారు.
ఆరుగాలం శ్రమించి అమ్ముకోవడానికి తె చ్చుకొన్న ధాన్యాన్ని మార్కెట్ అధికారులు కాంటా వేయకుండా నిర్లక్ష్యం చేస్తూ అరిగోస పెడుతున్నారని, ఆరబోసిన మక్కలు వరద నీటిలో కొట్టుకుపోవడంతో రైతులు బోరుమన్నారు. వారంరోజుల నుంచి ఆరబెట్టుకున్న ధాన్యం వర్షంలో పూర్తిగా తడిచిపోవడంతో అన్నదాతకు భారీ నష్టం జరిగింది. నెల రోజులుగా మార్కెట్కు రైతులు తెస్తున్న మక్కలను సకాలంలో కాంటా వేయడం లేదని, ఎన్నోసార్లు రోడ్డెక్కి ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలు చేపట్టినా ఇప్పుడు అప్పుడూ అంటూ జిల్లా అధికారులు కాలయాపన చేస్తున్నారే తప్పా సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు.
క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు వచ్చి చూసిపోవడమే గానీ, ఎవరూ పట్టించుకోకపోవడంతో తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడంలేదన్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పం దించి రైతు బాధలను విని, పంటలను కాంటా వేసి, మా ర్కెట్ నుంచి తరలించేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
పెబ్బేరు, మే 10 : ఆదివారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి పెబ్బేరు వ్యవసాయ మార్కెట్ యార్డులోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు నిల్వ చేసిన ధాన్యం రాశులు తడిసిపోయాయి. కొంత మంది రైతులకు నిర్వాహకులు ధాన్యంపై కప్పేందుకు కవర్లు పంపిణీ చేయలేదు. దీంతో వర్షానికి వారి ధాన్యం మొత్తం తడిసి ముైద్దెంది. మరి కొందరు రైతులు తమ ధాన్యానికి కవర్లు కప్పినప్పటికీ నీరు చుట్టు ముట్టడంతో కింది భాగంలో నీరు చేరి ధాన్యం రాశులు తడిసిపోయాయి. మొత్తానికి కొనుగోళ్ల ప్రక్రియ నత్తనడకను తలపిస్తోందని రైతులు వాపోయారు. కేంద్రానికి ధాన్యం తెచ్చి రోజులు గడుస్తున్నప్పటికీ కొనుగోళ్లు చేయడం లేదని వారు ఆరోపించారు. మండలంలోని అన్ని కొనుగోలు కేంద్రాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.