Karnataka : కర్ణాటకలో దారుణం జరిగింది. తన భార్య మీద అనుమానంతో ఆమెను ఉరివేసి చంపేశాడు. అంతేకాదు.. తన భార్య చనిపోతుండగా చూడాలంటూ ఆమె తల్లిదండ్రులకు వీడియో కాల్ కూడా చేశాడు. ఈ ఘటన కర్ణాటక, బంగళ్కోట్ జిల్లాలో సోమవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భాగ్యశ్రీ జిగలూరు అనే మహిళకు, ప్రవీణ్ అనే వ్యక్తికి కొంతకాలం క్రితం పెళ్లి జరిగింది. అయితే, పెళ్లైనప్పటి నుంచి అతడికి భార్యపై అనుమానం ఉండేది. తన భార్యకు మరొకరితో వివాహేతర సంబంధం ఉందని భావించేవాడు.
దీంతో అనేకసార్లు భార్యాభర్తల మధ్య ఈ అంశంపై విబేధాలు తలెత్తాయి. ప్రవీణ్ ఎప్పుడూ తన భార్యను తిట్టడం, దాడి చేయడం చేసేవాడు. దీంతో ఆమె నిత్యం పుట్టింటికి వెళ్లేది. అలా, ఇటీవల కూడా పుట్టింటికి వెళ్లింది. అయితే, తాజాగా ప్రవీణ్ భార్య పుట్టింటికి వెళ్లి ఆమె తల్లిదండ్రులకు నచ్చజెప్పాడు. ఇకపై భార్యపై దాడి చేయబోనని, ఆమెను బాగా చూసుకుంటానని, కలిసుంటామని హామీ ఇచ్చాడు. అతడి మాటలు నమ్మిన భాగ్యశ్రీ కుటుంబ సభ్యులు ఆమెను అతడితో పంపించేందుకు అంగీకరించారు. దీంతో సోమవారం ఉదయమే భాగ్యశ్రీ తన భర్త వద్దకు వెళ్లింది. అయితే, అదే రోజు రాత్రి భార్యపై కర్రతో దాడి చేశాడు. అనంతరం ఆమెను ఒక దుప్పటితో ఉరివేశాడు. అంతేకాదు.. భాగ్యశ్రీ ప్రాణం పోతూ గిలగిలా కొట్టుకుంటుండగా, ఆమె తల్లిదండ్రులకు వీడియో కాల్ చేశాడు.
వారి కూతురు ప్రాణం పోతూ విలవిలలాడటం చూడాలంటూ చెప్పాడు. ఆమె మరణించిన తర్వాత కూడా ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాల్ని వారి బంధువలు, స్నేహితులకు షేర్ చేశాడు. ఘటనపై భాగ్యశ్రీ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అరెస్టు చేశారు. భాగ్యశ్రీ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.