గద్వాల/గద్వాల రూరల్, మార్చి10 : అబద్ధాల హామీల పునాదులపై గద్దెనెక్కిన రేంవత్ సర్కారు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని రైతులు,ప్రజలు ఆరోపిస్తున్నారు. జనవరి 26న పైల్ ప్రాజెక్టు కింద ప్రతి నియోజకవర్గంలోని ఓ మండలంలో గ్రా మాన్ని ఎంపిక చేశారు. ఆ గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు వందశాతం అమలు చేసి.. స్ఫూర్తిగా మిగతా గ్రామాల్లో అమలు చేస్తామని ప్రభుత్వంలోని పెద్దలు ప్రగల్భాలు పలికారు. అయి తే వాస్తవ పరిస్థితి అందకు భిన్నంగా ఉన్నది. ఎంపిక చేసిన గ్రామాల్లో వందశాతం సంక్షేమ పథకాల అమలు అటకెక్కింది.
అయితే అమలు తీరు తెలిపేందుకు అధికారులు భయపడుతున్నారు. ‘ప్రభుత్వం చెప్పిం ది మేం చేస్తున్నాం.. అంతే తప్పా మమ్మల్ని సమాచారం కోసం ఇబ్బందులు పెట్టవద్దు’.. అంటూ అధికారులు ప్రాధేయపడుతున్న పరిస్థితి. ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసేందుకు గ్రామాల్లో రైతుభరోసా, ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకాలను వంద శాతం అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఆ దిశగా ముందుకు సాగడంలో పూర్తిగా విఫలమైందని ప్రజలు, రైతులు ఆరోపిస్తున్నారు. పబ్లిసిటీ కోసం చెప్పి అమలు చేయడంలో విఫలం కావడంతో పథకాలు గ్రామాల్లో నిద్దరోతున్నాయి. ఈ నేపథ్యంలో పైలట్ గ్రామాలుగా ఎంపికైన గద్వాల మండలం కుర్వపల్లి, (నల్లదేవరపల్లి), కేటీదొడ్డి మండలం ఉమిత్యాలలో ‘నమస్తే’ బృందం పర్యటించి ప్రభుత్వ పథకాల అమలుపై ఆరా తీసింది.
కాంగ్రెస్ సర్కారు ఎంపిక చేసిన గ్రామాల్లో ప్రతిష్టాత్మకంగా సంక్షేమ పథకాలను వందశాతం అమలు చేస్తామని చెప్పినా ఆ దిశగా ప్రయత్నాలు ఇంకా మొదలు పెట్టలేదు. దీంతో ఆ గ్రామాల్లో వందశాతం సంక్షేమ పథకాల అమలు అటకెక్కింది. కుర్వపల్లి(నల్లదేవరపల్లి) గ్రామంలో రైతు భరోసా రైతులందరికీ, ఆత్మీయ భరోసా కూడా అందరికీ వచ్చింది. కానీ రుణమాఫీ మాత్రం పూర్తి స్థాయిలో కాలేదు. ఇందిరమ్మ ఇండ్ల కోసం 141 మంది దరఖాస్తు చేసుకోగా అందులో 22 దరఖాస్తులను వివిధ కారణాలతో అధికారులు తిరస్కరించారు.
మిగతా 119 మందికి అన్నా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశారా? అంటే ఇప్పటి వరకు మంజూరు విషయమై లబ్ధిదారులకు తెలియదు. అధికారుల వద్ద ఉన్న కాగితాల మీదే ఇవన్నీ ఉన్నాయే తప్పా వాస్తవంగా ఏది కనిపించదు. కులగణన సర్వే ఆధారంగా రేషన్ కార్డుల లబ్ధిదారులను ఎంపిక చేయగా గ్రామంలో కేవలం 51 మంది జాబితా మాత్రమే అధికారుల వద్ద ఉన్నది. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న దరఖాస్తులు ఎటు పోయాయో ఎవరికి అర్థం కావడం లేదు.
సంక్షేమ పథకాలు వంద శాతం అమలులో భాగంగా కేటీదొడ్డి మండలంలోని ఉమిత్యాల గ్రామాన్ని అధికారులు ఎంపిక చేశారు. అక్కడ రైతులకు రైతు భరోసా, ఉపాధి కూలీలు తక్కువగా (24 మంది) ఉండడంతో వారికి ఆత్మీయ భరోసా అమలైంది. కులగణనలో భాగంగా ఇళ్లు లేని నిరుపేదలు 185 మందిని గుర్తించారు. ప్రస్తుతం ఇండ్ల ఎంపికలో 109 మంది లబ్ధిదారుల జాబితా మాత్రమే రావడంతో మిగ తా వారు ఆందోళన చెందుతున్నారు. గ్రామంలో రేషన్ కార్డులు కేవలం ఐదు మందికి మాత్రమే మంజూరయ్యాయి. తిరిగి దరఖాస్తు చేసుకోమని అధికారులు చెప్పగా కొత్తగా 91 మంది రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఎంపిక చేశారు కానీ.. పథకాల అమలు మాత్రం మొదలు పెట్టలేదు. ఎంపిక చేసిన గ్రామాల్లో అరకొరగా అమలు చేసి.. మేము ఇచ్చిన మాట ప్రకారం అన్ని అమలు చేశామని ప్రభుత్వం ఉట్టిమాటలు చెబుతున్నదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన గ్రామాల్లో ప్రభుత్వం వంద శాతం హామీలు అమ లు చేస్తామని చెప్పింది.. కా నీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉన్నది. ఈ గ్రామా ల్లో ఎక్కడ కూడా సంక్షేమ పథకాలు అమలు కాలేదు. కేవలం కాగితాలు, అధికారుల రికార్డుల్లో మాత్రమే కనిపిస్తాయి కానీ..
వాస్తవ అభివృద్ధి ఏదీ కనిపించదు.