భూత్పూర్, ఏప్రిల్ 01 : రాష్ట్రంలో పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. మంగళవారం భూత్పూర్ మండలంలోని తాటికొండ గ్రామం, మున్సిపాలిటీ పరిధిలోని రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. భారతదేశంలో ఎక్కడా కూడా పంపిణీ చేయని విధంగా తెల్ల రేషన్ కార్డుపై సన్న బియ్యం పంపిణీ చేస్తున్న ఘనత సీఎం రేవంత్ రెడ్డి దేనని కొనియాడారు. గతంలో రేషన్ దుకాణాల్లో పంపిణీ చేసే బియ్యాన్ని తినలేక చాలామంది బజారులో అమ్ముకునేవారు. ఈ విషయాన్ని గ్రహించిన ప్రభుత్వం పేద ప్రజలకు కూడా సన్న బియ్యాన్ని పంపిణీ చేయాలని సంకల్పించినట్లు తెలిపారు.
తాటికొండ గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని గ్రామస్తులు తెలుపడంతో ఎమ్మెల్యే వెంటనే స్పందించి మూడు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తాసీల్దార్ జయలక్ష్మి, ఆర్ఐలు బాలసుబ్రమణ్యం, వెంకటేశ్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీపీ కదిరే శేఖర్ రెడ్డి, పట్టణాధ్యక్షుడు నవీన్, కాంగ్రెస్ నాయకులు గోవర్ధన్ గౌడ్, విజయ్, నరసింహారెడ్డి, హర్యానాయక్, నర్సింలు, రేషన్ డీలర్లు సుదర్శన్, యాదయ్య పాల్గొన్నారు.