మహబూబ్‌నగర్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వలసలు.. ఆకలి చావులు.. సాగు తాగునీటి కోసం గోసపడ్డ పాలమూరు ఇవాళ సగర్వంగా తలెత్తుకుంటున్నది.. వలసల జిల్లా రూపు పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు పొట్టకూటి కోసం వలసలు వెళ్లే పా లమూరు జిల్లాకు ఇవాళ ఇతర రాష్ర్టాల నుంచి వలసలు వచ్చే పరిస్థితి నెలకొంది.. 2014లో పాలమూరు ఎంపీ గా తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ర్టానికి తొలి ముఖ్యమంత్రి అయ్యాక పాలమూరు జిల్లా రూపురేఖలే మారిపోయాయి.. గడిచిన పదేండ్లలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సుమా రు రూ.40,000 కోట్లతో అభివృద్ధిని పరుగులు పెట్టిం చి.. కోట్లాది రూపాయల సంపదను సృష్టించారు.. నీటిపారుదల, విద్య, వైద్య, ఆరోగ్యరంగాలతోపాటు పల్లె లు, పట్టణాల రూపురేఖలు మారడంతో పదేండ్లలో ఉమ్మడి జిల్లా స్వరూపమే మారిపోయింది. ఉమ్మడి జిల్లాలో 2014లో ఆరు లక్షల ఎకరాలకు మించని సాగు భూములు, ఇవాళ 14 లక్షలకు పెరిగింది. వృ థాగా పోతున్న కృష్ణ, తుంగభద్ర, భీమా నదీ జలాలు తరలించి బీడు భూములను సస్యశ్యామలం చేశారు. ఉమ్మడి జిల్లాలోని అనేక వాగులు వంకలపై చెక్ డ్యాములు నిర్మించి ఎక్కడికక్కడే నీటిని ఒడిసిపట్టారు. దీంతో భూగర్భ జలాలు కనివినీ ఎరుగని రీతిలో పెరిగిపోవడంతో ఉమ్మడి జిల్లాలో రికార్డు స్థాయిలో ధాన్యం పండుతోంది. ఐదు జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్లు, మెడికల్ కళాశాలలు నిర్మించి విద్య, వైద్య రంగాలను ఎంతో అభివృద్ధి చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వాసుల కళాయిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కూడా పూర్తి చేసి వచ్చే ఖరీఫ్ నాటికి దశలవారీగా సాగునీరు ఇచ్చే విధంగా ప్లాన్ చేశారు. మిషన్ భగీరథ పథకం కింద ప్రతి పల్లెకు తాగునీరు అందిస్తున్నారు. చిన్న జిల్లాల ఏర్పాటుతో పరిపాలన సౌలభ్యంతోపాటు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పరుగులు పెట్టించారు. రైతులు, ప్రజలకు 24గంటలు నాణ్యమైన కరెంటు ఉచితంగా అందజేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయక వాటిని ఇతరుల మీద నెట్టే ప్రయత్నం ప్రారంభించింది. అప్పులు కుప్పలు తెప్పలు అంటూ అబద్ధాల ప్రచారం చేస్తున్నది. దీంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్లో స్వేదపత్రం విడుదల చేశారు. ఈ పదేండ్లలో తెలంగాణ సాధించిన అభివృద్ధిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఈ పదేండ్లలో సుమారు రూ.10వేల కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. జిల్లా కేంద్రాల్లో సమీకృత కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాలు, సామూహిక మార్కెట్లు, రహదారులు, పాఠశాలలు, కళాశాలలు ఇతర భవనాలు, పట్టణ ప్రగతి, పల్లెప్రగతి కింద రూ.వందల కోట్లతో అభివృద్ధి పనులు నిర్వహించింది. మిషన్ భగీరథ పథకం కింద తాగునీటి వసతి కోసం పెద్ద ఎత్తున సంప్హౌస్లు, ట్యాంకులు, కిలోమీటర్ల మేర పైప్లైన్లు వేశారు. మిషన్ కాకతీయ పథకం కింద సుమారు 1500కు పైగా చెరువులను రూ.వెయ్యి కోట్లతో బాగు చేశారు. అదనంగా లక్ష ఎకరాల దాకా చెరువుల కింద సాగయ్యే విధంగా చేశారు. పట్టణాల్లో చెరువులను సుందరీకరించి ట్యాంక్ బండ్‌గా మార్చారు. జిల్లా కేంద్రాలు, పట్టణాల్లో రూ.వందల కోట్లతో ఆహ్లాదకరంగా పార్కులను ఏర్పాటు చేశారు. అచ్చంపేటలో పర్యాటకుల కోసం జంగిల్ సఫారీ.. మహబూబ్‌నగర్‌లోని అర్బన్ జంగల్ సఫారీ ఆకట్టుకుంటున్నది. 2వేల ఎకరాల్లో కేసీఆర్ అర్బన్ పార్కు ఏర్పాటుతో హైదరాబాద్‌కి వెళ్లే అవసరం లేకుండా ఇక్కడే పర్యాటకులతో సందడిగా మారింది. ఉమ్మడి జిల్లాలో మండలాలకు డబుల్ రోడ్లు, గ్రామాలకు సింగిల్ లైన్ బీటీ రోడ్లు, పల్లెల్లో సీసీ రోడ్లు, రైతు వేదికలు, వైకుంఠధామాలు, సెగ్రిగేషన్ షెడ్లు, క్రీడా ప్రాంగణాలు, పల్లె ప్రకృతి వనాలు, మన ఊరు-మన బడి కింద పాఠశాలల రూపురేఖలు మార్చడంతోపాటు కొత్తగా దేవరకద్ర-కృష్ణ రైల్వే లైన్, మహబూబ్‌నగర్ నుంచి సికింద్రాబాద్ వరకు రైల్వే డబ్లింగ్, విద్యుత్ లైన్ ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి సంపద సృష్టించింది కేసీఆర్ సర్కార్. మహబూబ్‌నగర్‌లో రూ.50 కోట్లతో హరిత హోటల్, మన్యంకొండలో రూ.40 కోట్లతో రోప్‌వే, రూ.25 కోట్లతో కురుమూర్తి ఆలయ అభివృద్ధితోపాటు ఉమ్మడి జిల్లాలోని గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్, నారాయణపేట జిల్లాలో కనీవినీ ఎరుగని అభివృద్ధి కండ్లకు కనిపిస్తోంది. వీటన్నింటినీ వదిలేసి కాంగ్రెస్ పార్టీ కేవలం కావాలని అప్పుల పాలైనట్టు దుష్ప్రచారం మొదలు పెట్టింది. ఉమ్మడి పాలమూరు జిల్లా అనేక రంగాల్లో అభివృద్ధి సాధించినా కూడా రేవంత్ ప్రభుత్వం అబద్ధాలు ప్రచారం చేస్తే సొంత జిల్లాకే వెన్నుపోటు పొడిచిన వాళ్లు అవుతారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.
పాలమూరు జిల్లా అంటే ఒకప్పుడు వలసలకు ప్ర సిద్ధి. తెలంగాణ రాకముందు ఏటా 14 లక్షల మంది మహానగరాలకు వలస పోయేవాళ్లు. ఎన్నో కుటుంబా లు ఇతర ప్రాంతాల్లో స్థిరనివాసాలు ఏర్పరచుకున్నా రు. పుట్టిన ఊరు వదిలిపెట్టి ఎంతోమంది పొట్టచేత పట్టుకొని వలసలు పోయారు. ఇక్కడ పనిలేక పొలాలకు సాగునీరు లేక.. తాగడానికి గుక్కెడు మంచినీరు లేక అనేక గోసపడ్డారు. కానీ ఇవాళ తెలంగాణ వ చ్చాక కేసీఆర్ సర్కార్ హయాంలో పాలమూరు రూపురేఖలే మారిపోయాయి. పెండింగ్ ప్రాజెక్టులన్నీ రన్నిం గ్ ప్రాజెక్టులు కావడం, సుమారు రూ.2000 కోట్లతో మిషన్ భగీరథ పథకాన్ని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్ర వేశపెట్టి నిత్యం మంచినీళ్లు అందిస్తున్నది. సాగునీటికి తాగునీటికీ ఢోకా లేకపోవడంతో పల్లెటూర్లు పచ్చదనం తో కళకళలాడుతున్నాయి. దీంతో వలస వెళ్లిన వా రంతా వాపస్ వచ్చి పొలాలను సాగు చేసుకుంటుండడంతో పచ్చదనం పరిడవిల్లింది. ఇతర రాష్ర్టాలకు చెందిన కూలీలే పాలమూరు జిల్లాకు వలసలు వస్తున్నారంటే ఎంత మార్పు జరిగిందో అర్థం చేసుకోవ చ్చు. ఎన్నాడూ రూ.మూడు లక్షల ధర పలకని భూ ములు నేడు రూ.20 లక్షల నుంచి రూ.40 లక్షలకు ఎకరా లభించే పరిస్థితి ఏర్పడింది. 55 ఏండ్లు రాష్ర్టా న్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ పాలమూరును ఏ మేర అభివృద్ధి ఏం చేసిందో.. ఈ పదేండ్లలో కేసీఆర్ సర్కార్ చేసిన అభివృద్ధి ఏంటో ప్రజలు అర్థం చేసుకోవాలి.
ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజల చిరకాల వాంఛ అయిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి రూ. 26,738 కోట్లు ఖర్చు చేసింది. కొల్లాపూర్ నియోజకవర్గంలోని నార్లాపూర్ వద్ద కృష్ణానది జలాలను ఎత్తిపోసి ఐదు రిజర్వాయర్లను ఏర్పాటు చేసి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాతో పాటు వికారాబాద్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలోని 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేశారు. 2015 జూన్ 11న కేసీఆర్ సర్కార్ మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం కరివెన వద్ద ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసింది. ఈ ప్రాజెక్టు పూర్తి కాకుండా విపక్షాలు అనేక అడ్డంకులు సృష్టించాయి. కేంద్రం కృష్ణా జలాల వాటాను తేల్చకున్నా కేసీఆర్ సర్కార్ ఇప్పటివరకు తొంబై శాతం పనులను పూర్తి చేసింది. నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉదండాపూర్ రిజర్వాయర్లను నిర్మించి సుమారు 70 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు ఏర్పాటు చేసింది. ఒక్క ఉదండాపూర్ రిజర్వాయర్ తప్పా మిగతా పనులన్నీ దాదాపుగా పూర్తయ్యాయి. 2014ముందు ఉమ్మడి జిల్లాలో పెండింగ్‌లో ఉన్న భీమా, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ పథకాలను కూడా రూ. మూడు వేల కోట్లతో పూర్తిచేసి అదనంగా సాగు విస్తీర్ణం పెం చింది. 2014లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సాగు వి స్తీర్ణం కేవలం ఆరు లక్షల ఎకరాలు ఉండగా 2023 నా టికి 14 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతున్నది. అంతేకాకుండా మరో రూ.వెయ్యి కోట్లతో ఉమ్మడి జి ల్లా వ్యాప్తంగా అనేక వాగులు, వంకలపై చెక్ డ్యాంలు కట్టి ఎక్కడికక్కడే నీటిని ఒడిసిపట్టింది.
గతంలో మెడికల్ కాలేజీలో చదవాలంటే ఎక్కడో హైదరాబాద్‌కు పోవాల్సిన పరిస్థితి వైద్య విద్యార్థులకు ఉండేది. గడిచిన పదేండ్లలో ఒక్క ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో నే ఐదు మెడికల్ కళాశాలలను కేసీఆర్ సర్కార్ ఏర్పాటు చే సింది. మహబూబ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీ 2018లో అందుబాటులో రాగా నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాలోని కళాశాలలు 2022లో అందుబాటులోకి వచ్చాయి. గద్వా ల, నారాయణపేట జిల్లాలోని మెడికల్ కళాశాలల పనులు కొనసాగుతున్నాయి. దీంతో ప్రజలు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ఆ యా జిల్లా కేంద్రాల్లోని అందుకొనే అవకాశం ఉంది. రూ.1500 కోట్లతో మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేసింది. దీంతోపాటు నర్సింగ్, డిగ్రీ, జూనియర్ కాలేజీలు, గురుకుల పాఠశాలలను కూడా నెలకొల్పి విద్య, వైద్య రంగాలను బలోపేతం చేసింది. గతంలో ప్రైవేటు విద్యకే మొగ్గుచూపే విద్యార్థులు ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో పోటీపడి చదువుతున్నారు. అడ్మిషన్లు ఫుల్, హై రెకమండేషన్లు, అదనపు కాలేజీలను సీట్లను నెలకొల్పే పరిస్థితికి వచ్చింది.