Timmajipeta | తిమ్మాజిపేట, జూన్ 24 : ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నామని, మెరుగైన ఫలితాలను సాధిస్తామని జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్ అన్నారు. మంగళవారం గొరిట గ్రామంలోని పాఠశాలలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గ్రామానికి చెందిన నేత శ్యాం ప్రసాద్ రెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మంచినీటి సౌకర్యాన్ని కల్పించడంతోపాటు, గత పదవ తరగతి ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను సన్మానించి, నగదు పురస్కారం అందజేశారు.
కార్యక్రమంలో పాల్గొన్న డిఈఓ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో అన్ని సౌకర్యాలు ఉన్నాయని, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉన్నారని, తల్లిదండ్రులు ప్రైవేటు వైపు తమ పిల్లలు పంపించకుండా, ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. బైజూస్ లాంటి ఖరీదైన ఆన్లైన్ కోచింగ్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా ఇప్పిస్తున్నామని తెలిపారు. విద్యార్థులు చక్కగా చదివి, తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలన్నారు. పాఠశాలలో డైనింగ్ హాల్‌తో పాటు, ఇతర సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ సత్యనారాయణ శెట్టి, జిహెచ్ఎం గోవిందప్ప, జానకి రామ్ రెడ్డి తదితరులు గ్రామస్తులు పాల్గొన్నారు.