ఊట్కూర్ : విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ( Collector Sikta Patnaik ) ఉద్యోగులను హెచ్చరించారు. గురువారం ఊట్కూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక దవాఖాన, తహసీల్ కార్యాలయం, పీఎం శ్రీ పథకానికి ఎంపికైన ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను ఆకస్మిక తనిఖీ ( Sudden Visit ) చేశారు.
స్థానిక ప్రభుత్వ దవాఖానలో ప్రసూతి గదిని పరిశీలించారు. రికార్డులను తనిఖీ చేసి గడిచిన రెండు మూడు నెలలలో కాన్పుల సంఖ్య తక్కువగా ఉండటంపై వైద్య సిబ్బందిని ప్రశ్నించారు. ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ (EDD) రిజిస్టర్ మెయింటినెన్స్ చేయకపోవడంపై పీహెచ్ సీ వైద్యురాలు సంతోషిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓపీ, మందుల స్టాక్ వివరాలను తెలుసుకున్నారు.
దవాఖానలో అందుతున్న వైద్య సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉంటూ దవాఖాన ప్రాంగణాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు. తహసీల్ కార్యాలయానికి చేరుకుని ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులు, నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల భూ సేకరణ సర్వేకు సంబంధించిన రికార్డులను కలెక్టర్ తనిఖీ చేశారు.
పీఎం శ్రీ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచాలి..
మండల కేంద్రంలోని పీఎం శ్రీ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. పాఠశాల ప్రాంగణంలోని కిచెన్ గది వరండాలో కట్టెల పొయ్యి పై మధ్యాహ్న భోజనం వంటలను వండేందుకు సిద్ధం చేస్తుండగా వంట ఏజెన్సీలను మందలించారు. పీఎం శ్రీ నిధుల ద్వారా సోలార్ పవర్ ను ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం ఉందని, వరండాలో కట్టెలతో మధ్యాహ్న భోజనం వండితే విద్యార్థుల ఊపిరితిత్తులు దెబ్బతినే ప్రమాదం ఉంది కదా అని జీహెచ్ఎం మాధవిని ప్రశ్నించారు.
పీఎం శ్రీ పాఠశాలకు మంజూరైన డెస్క్ టాప్ కంప్యూటర్లను, పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కూరగాయల పెరటి తోటను పరిశీలించారు. పదో తరగతి విద్యార్థుల పాఠ్య ప్రణాళికను తెలుసుకొని అభినందించారు. కార్యక్రమంలో తహసీల్దార్ రవి, సీనియర్ అసిస్టెంట్ రాఘవేంద్ర రెడ్డి, ఆర్ఐలు కృష్ణారెడ్డి, వెంకటేష్, కంప్యూటర్ ఆపరేటర్ జ్యోతి పాల్గొన్నారు.