అచ్చంపేటరూరల్ : నిరుద్యోగ యువత హక్కుల సాధన కోసం చేస్తున్న పోరాటంలో నిరుద్యోగులను అక్రమంగా అరెస్టు చేయడం అన్యాయమని డీవైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు వర్ధo సైదులు అన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఛలో సచివాలయం ముట్టడికి బయలు దేరిన నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడికక్కడ అడ్డుకుందని ఆరోపించారు.
జాబ్ క్యాలెండర్ (Job calendar) ఇచ్చేవరకు పోరాడుతామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి సంవత్సరం రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి కాలయాపన చేయడం సరికాదన్నారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు. రాజీవ్ యువ వికాసం పథకాన్ని అందరికీ వర్తిస్తామని చెప్పి కొందరికే పరిమితం చేయడం బాధాకరమని అన్నారు. నిరుద్యోగ భృతి ఊసే లేదని ఆరోపించారు.