అయిజ, డిసెంబర్ 30 : కర్ణాటకలోని ఆర్డీఎస్ ఆనకట్టకు ఇండెంట్ నీరు స్వల్పంగా చేరుతున్నది. కర్ణాటకలోని టీబీ డ్యాం నుంచి ఆర్డీఎస్ ఆనకట్టకు ఈనెల 26వతేదీన నీరు విడుదల చేయడంతో తుంగభద్ర నదిలో ప్రవహిస్తూ ఆర్డీఎస్కు చేరుతున్నది. సోమవారం ఆర్డీఎస్ ఆనకట్టకు 380క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉండగా, 420క్యూసెక్కులు అవుట్‌ఫ్లో ఉన్నది. 300 క్యూసెక్కులు ఆర్డీఎస్ ఆయకట్టుకు చేరుతుండగా, 120 క్యూసెక్కులు ఆర్డీఎస్ స్లూయిస్ గుండా దిగువకు ప్రవహిస్తుంది. ప్రస్తుతం ఆర్డీఎస్ ఆనకట్టలో 6.7అడుగుల మేర నీటిమట్టం ఉన్నట్లు ఆర్డీఎస్ ఈఈ శ్రీనివాస్ తెలిపారు.
టీబీ డ్యాం నుంచి జనవరి 5వ తేదీ వరకు నీటి విడుదల కొనసాగనుండగా, జనవరి 10 వరకు ఆర్డీఎస్ ఆనకట్టలో నీటిమట్టం నిలకడగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఆర్డీఎస్ ఆనకట్టకు నీటి చేరిక మొదలు కావడంతో ఆయకట్టుకు నీటి విడుదల పెంచుతున్నట్లు ఈఈ పేర్కొన్నారు. మూడురోజుల్లో ఆర్డీఎస్ ఆనకట్ట నుంచి సుంకేసుల బ్యారేజీకి ఇండెంట్ నీరు చేరుతున్నదని వెల్లడించారు. ఆర్డీఎస్ ఇండెంట్‌తోపాటు కేసీ కెనాల్ ఇండెంట్‌ను జాయింట్‌గా విడుదల చేసి ఆర్డీఎస్ ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఈఈ తెలిపారు.
కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంలో ప్రస్తుతం నీటి నిల్వ 82.463 టీఎంసీలు ఉంది. సోమవారం టీబీ డ్యాం ద్వారా కర్ణాటక పరిధిలోని కాల్వలతోపాటు తెలంగాణ, ఏపీ రాష్ట్రంలోని ఆయకట్టుకు సాగునీరు అందించే హెచ్ఎల్సీ, ఎల్ఎల్సీ కాల్వలకు 9,035 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు టీబీ బోర్డు సెక్షన్ అధికారి రాఘవేంద్ర తెలిపారు. ప్రస్తుతం డ్యాంలోకి 245క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉండగా, అవుట్లో 9,035 క్యూసెక్కులు ఉంది. టీబీ డ్యాంలో ప్రస్తుతం 82.463 టీఎంసీల నీటి నిల్వ ఉండగా, 1626.78 అడుగుల నీటి మట్టం ఉన్నట్లు ఆయన తెలిపారు.