అయిజ, జనవరి 8 : ఆర్డీఎస్ ఆయకట్టు పరిధిలోని యాసంగి పంటలకు 1500 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. 2024-25 ఏడాదికి గానూ ఆర్డీఎస్కు కేటాయించిన 5.896 టీఎంసీల నీటి వాటా నుంచి మొదటి విడుతలో గత డిసెంబర్ 26 నుంచి ఈనెల 5 వరకు 1.078 టీఎంసీలు వదిలారు. రెండో విడుతలో 10 రోజులపాటు 1.04 టీఎంసీని విడుదల చేయాలని రాష్ట్ర జలవనరుల శాఖ ఈఎన్సీ అనిల్‌కుమార్ మంగళవారం ఇండెంట్ పెట్టారు.
దీంతో టీబీ బోర్డు అధికారులు బుధవారం డ్యాం నుంచి నీళ్లు వదిలారు. ఐదు రోజు లు 1500 క్యూసెక్కులు, చివరి ఐదు రోజులు వె య్యి క్యూసెక్కుల చొప్పున ఇవ్వాలని నిర్ణయించారు. శనివారం నాటికి నీళ్లు కర్ణాటకలోని ఆర్డీఎస్కు చేరుతాయని ఈఈ విజయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఈ ఏడాది ఐఏబీ సమావేశంలో ఆర్డీఎస్ పరిధిలో 37 వేల ఎకరాల ఆరుతడి పంటలకు నీళ్లివ్వాలని నిర్ణయించారని, అందుకనుగుణంగా విడుదలకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఆర్డీఎస్ ఆనకట్ట వద్ద నీటినిల్వలు క్రమేపీ తగ్గుతున్నాయి. 238 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉండగా, ప్రధాన కాల్వకు 138 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. 50 క్యూసెక్కులు స్లూయిస్ ద్వారా దిగువకు ప్రవహిస్తున్నాయి. ప్రస్తుతం ఆనకట్టలో 5.3 అడుగుల నీటిమట్టం ఉన్నది. కాగా టీబీ డ్యాంకు ఇన్‌ఫ్లో నిలిచిపో గా, అవుట్‌ఫ్లో 8,270 క్యూసెక్కులుగా నమోదైంది. పూర్తిస్థాయి సామర్థ్యం 105.788 టీఎంసీలు ఉండ గా.. ప్రస్తుతం 75.580 టీఎంసీలు నిల్వ ఉన్నట్లు బోర్డు సెక్షన్ అధికారి రాఘవేంద్ర తెలిపారు.
తుమ్మిళ్ల పంపునకు అందేనా..?
టీబీ డ్యాం నుంచి విడుదలైన నీరు ఆర్డీఎస్ వరకే చేరింది. ఆయకట్టు పరిధిలోని డీ-20 వరకు అంతంత మాత్రమే చేరాయి. ఆర్డీఎస్, తుమ్మిళ్ల పంపునకు నీరు చేరేందుకే అధికారులు రెండు విడుతలుగా ఇండెంట్ పెట్టి టీబీ డ్యాం నుంచి నీటిని విడుదల చేయించారు. కానీ కర్ణాటక, ఏపీ రాష్ర్టాల్లోని ఎత్తిపోతల పథకాలు, అక్కడి రైతులు ఏర్పాటు చేసిన భారీ మోటర్ల కారణంగా ఆర్డీఎస్ ఆనకట్టకు చేరాల్సిన నీటిని పూర్తిస్థాయిలో రావడం లేదు. నీటి లభ్యత లేని కారణంగా తుమ్మిళ్ల పంపును పూర్తిగా నిలిపివేశారు.
సుంకేసుల బ్యారేజీలో ఎఫ్ఆర్ఎల్ పడిపోయింది. ఈ సారైనా తుమ్మిళ్ల పంపునకు నీరు అందింతే ఆయకట్టుకు సాగునీరు అందుతుందని, లేకుంటే సాగు ప్రశ్నార్థకమే అని రైతులు ఆందోళన చెదుతున్నారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు, ఇరిగేషన్ అధికారులు సమన్వయంతో వ్యవహరించి కేసీ కెనాల్ నీటి వాటాను తుంగభద్ర నదిలో విడుదల చేయించేందుకు కృషి చేయాలని అన్నదాతలు విజ్ఞప్తి చేస్తున్నారు. అప్పుడు ఆర్డీఎస్, తుమ్మిళ్ల ఆయకట్టుతోపాటు ఏపీలోని కేసీ కెనాల్ రైతులు, ఎత్తిపోతల పథకాలకు నీటి కొరత తీరుతుందన్నారు.