వనపర్తి, మార్చి 27 (నమస్తే తెలంగాణ) : మదనాపురం మండలం నెల్విడి ఎత్తిపోతల పథకం కింది ఆయకట్టులోని వరి పొలాలు 20రోజులుగా సాగునీటికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ ఎత్తిపోతల పథకంలో ఆయకట్టు రైతులు బోర్ల ద్వారా ఇప్పటి వరకు సాగును నెట్టుకొచ్చారు. మార్చిలోనే ఎండలు ముదరడం..బోర్లలో నీటిశాతం తగ్గడం..
కరెంట్ కోతలు కూడా పెరగడంతో నెల్విడి పథకంలోని స్టేజీ -2లో 1200 ఎకరాల ఆయకట్టు ప్రమాదంలో పడింది. ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని తీసుకొనే వెసలుబాటు ఉన్నప్పటికీ ట్రాన్స్ఫార్మర్లోని సా మగ్రిని దొంగలు ఎత్తుకెళ్లడంతో సమస్య జఠిలమై ంది. అందునా స్టేజీ-1, స్టేజీ-2లోనూ విద్యుత్ అధికారులు కనెక్షన్లు తొలగించడంతో రైతులు బిక్కం మొఖం వేస్తున్నారు.
మదనాపురం మండలం ఎత్తిపోతల పథకం రెండు స్టేజీలతో ఏర్పాటైంది. ఈ పథకంలో మొత్తం 3100 ఎకరాల ఆయకట్టు ఉంది. మొదటి స్టేజి పంపింగ్ నెల్విడి, రెండో స్టేజి పంపింగ్ నర్సింగాపురం పరిధిలో ఏర్పాటు చేశారు. అయితే, ప్రస్తుత యాసంగిలో రైతులు పూర్తి ఆయకట్టును సాగు చేశారు. ప్రధానంగా అ లిప్టుల పరిధిలో రైతులందరికీ సొంతంగా బోరు బావులున్నాయి. అదే ధైర్యంతో యాసంగిలోనూ ఎప్పుడు వేసినట్లుగానే వరి సాగుచేశారు. నెల్విడితోపాటు నర్సింగాపురం, కొన్నూరు, ద్వారకానగర్ గ్రామాల రైతుల భూములకు సాగునీరందుతుంది. వానకాలంలో పుష్కలంగా వర్షాలు రావడంతో ఈ ఎత్తిపోతలతో అవసరం లేకుండానే రైతులకున్న నీటి వనరుల ఆధారంగానే పంటలు పండించారు.
నర్సింగాపురం పరిధిలోని ఎత్తిపోతల పథకంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్లోని సామగ్రి చోరీకి గురైంది. ఇది ఎప్పుడు జరిగిందో కూడా స్పష్టత లేదు. బోర్లు ఎండిపోతున్నందున ఫిబ్రవరి 2వ తేదీన పలువురు రైతులు వెళ్లి ఎత్తిపోతల మోటర్లనైనా నడిపించుకుందామని పరిశీలిస్తే అప్పుడు చోరీ ఘటన బయట పడింది. దీనిపై మదనాపురం పోలీస్‌స్టేషన్‌లో ఇరిగేషన్ ఏఈ వరప్రసాద్ ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు కేసు నమోదు కాలేదు. అయితే, ఇప్పుడు ఈ పొలాలకు నీళ్లు పారాలంటే..ఈ ట్రాన్స్ఫార్మర్ స్థానంలో మరొకటి ఏర్పాటు చేస్తే తప్పా సాధ్యం కాదు. ఎత్తిపోతల మెయింటెనెన్స్‌ను రైతులే స్వయంగా చూసుకునే అవకాశం ఉండగా, ఇప్పటికిప్పుడు ఈసమస్య తొలగాలంటే ప్రభుత్వ అధికారులు లేదా ప్రజా ప్రతినిధులు స్పందించి సహాకారం అందిస్తే తప్పా సాధ్యం కాదు.
నర్సింగాపురం పరిధిలోని స్టేజీ-2 నుంచి నీటిని ఎత్తిపోయాలంటే ట్రాన్స్ఫార్మర్ కావాలి. ఇప్పటికిప్పుడు రైతులు స్వయంగా చూసుకునే పరిస్థితి లేదు. ఈ క్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధుల చుట్ట్టూ రైతులు ప్రదక్షిణలు చేస్తున్నా కనికరించడంలేదు. దీనిపై విద్యుత్, ఇరిగేషన్ శాఖల అధికారులు తమకు సహకరించడం లేదని రైతులు చెబుతున్నారు. స్థానికంగా తమను ఎవరూ పట్టించుకోవడం లేదనే ఇటీవలే కొందరు రైతులు సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. సామగ్రిని దొంగిలించిన ట్రాన్స్ఫార్మర్ను సిద్ధం చేసుకోవాలన్న సాధ్యమయ్యే పరిస్థితుల్లేవు. ప్రత్యామ్నాయం చూపని పక్షంలో ఆయకట్టులోని 1200 ఎకరాల వరి పంట పొలాలు ప్రమాదం అంచున పయనించడం ఖాయం.
నెల్విడి ఎత్తిపోతల పథకంలోని నర్సింగాపురం పరిధిలోని రెండో స్టేజి కింద 1900ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో చాలా వరకు పంటలకు నీటి కష్టాలు మొదలయ్యాయి. రైతుల బోరుబావుల నీటి వనరులతోనే ఇప్పటి దాకా నడిపించుకున్నారు. అయితే, ఇటీవల నుంచి ఎండలు పెరగడం, బోరు బావుల్లో నీటిశాతం తగ్గడంతో బోర్లు పూర్తిగా నిలిచిపోతున్నాయి. ఇప్పటివరకు ఓ 20బోర్లకు పైగా ఎండిపోయినట్లు రైతులు చెబుతున్నారు. దీంతో చేతికి వచ్చే దశలో పంటలన్ని ప్రమాదంలో పడుతున్నాయి. యాసంగిలో ఎత్తిపోతల మోటర్లు నడిస్తే..ఇలా నీటి సమస్య వచ్చేది కాదన్న అభిప్రాయం ఉంది. ప్రస్తుతం 20రోజులకు పైగా నీటి తడులు అందక పోగా నీటి కష్టాలు రోజు..రోజుకు పెరుగుతున్నాయి.
ఆ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు గోపాల్‌రెడ్డి. ఊరు కొన్నూరు, మదనాపురం మండలం. ఇతని బామ్మర్ది నాగిరెడ్డి పొలాన్ని ఇతనే చూసుకుంటాడు. వీరికున్న రెండు ఎకరాలు వరి శిస్తు చేశాడు. దీనికి ఒక బోరు నీటి ఆధారం ఉంది. ప్రస్తుతం నెలరోజులుగా నీరు పూర్తిగా నిలిచిపోయింది. ఎవరైనా నీరిస్తారేమోనని ప్రతి రైతును అడుగుతున్నాడు. కానీ అందరికీ నీటి కష్టమొచ్చింది.
రెండెకరాల్లో ఎకరా పూర్తిగా ఎండి పోయింది. మరో ఎకరాలో కూడ సగభాగం ఎండింది. రోజుకు కొంత పశు వులకు మేపుతున్నాడు. ఈ రైతు తన పొలంలో ఇంత వరకు ఎప్పుడు ఎండిపోయిన దాఖలా చూడలేదు. ఎత్తిపోతల మోటర్లు నడిస్తే…ఈ పరిస్థితి ఉండేది కాదు. ఇప్పటి వరకు ఒక్క గోపాల్‌రెడ్డి పొలం పరిస్థితి మాత్రమే ఇలా కనిపిస్తుంది. మరో వారం రోజులు గడిస్తే..ఊరంతా ఎండిన వరి చేల వాతావరణమే దాపురిస్తుంది.