వనపర్తి, ఆగస్టు 9(నమస్తే తెలంగాణ) : నెల రోజులపాటు సమృద్ధిగా వర్షాలు కురిసినా వాటిని ఒడిసిపట్టడంలో అధికారులు, సర్కారు పూర్తిగా విఫలమైంది. దీంతో కాల్వల కింది సాగు ప్రశ్నార్థకంగా మారుతున్నది. ఎత్తిపోతల పథకాలపై ఆధారపడిన రైతులు అయోమయానికి గురవుతున్నారు. గతేడాదిలో యాసంగిలో నీళ్లు లేక సాగు చేసిన పంటలను ఎండబెట్టుకుని తీవ్రంగా నష్టపోయారు. ప్రస్తుత వానకాలం సీజన్లోనూ భరోసాగా సాగు చేసుకుందామంటే కాల్వల్లో నీళ్లు పారడం లేదు.
జూరాల కాల్వ కింద మాత్రమే సాగుకు అనుకూలంగా ఉన్నది. కేఎల్ఐ, భీమా ఎత్తిపోతల పథకాల కింద దాదాపు లక్ష ఎకరాలకు పైగా వరి సాగు గతంలో అ య్యేది. అయితే, జూరాల గేట్ల ద్వారా దిగువకు విడుదలైన నీరు శ్రీశైలం, నాగార్జునసాగర్ దాటి సముద్రంలో కలుస్తున్నా.. ఇక్కడి చెరువులకు మాత్రం చుక్క నీరు చేరడం లేదు. కేఎల్ఐ, భీమా-2 ఎత్తిపోతల పథకాల ద్వారా జిల్లాలోని 330 చెరువులకు నీటితో జలకళ రావాల్సి ఉండగా, ఇప్పటికీ వీటిలో పదిశాతం చెరువులకు కూడా నిండలేదు.
కాల్వల్లో నీరు వేగంగా రాకపోవడానికి అనేక కారణాలున్నాయి. వీటిలో ప్రధానంగా అక్కడక్కడా కాల్వలు పూడుకుపోవడం, మరికొన్ని చోట్ల జమ్ము తో సమస్య ఉత్పన్నమవుతున్నది. ఎండాకాలంలో వీటిపై దృష్టి పెట్టాల్సి ఉన్నా అటు అధికారులు గానీ.. ఇటు ప్రజాప్రతినిధులు ఆలోచించలేదు. గత యాసంగిలో సాగునీరు లేక తీవ్ర నష్టాల పాలైన అన్నదాత కష్టాల్లో ఉన్నాడు.
ఈ ఏడాదైనా నీటి ఇబ్బంది లేకుండా సాగు చేసుకుందామనుకుంటే అది కూడా అనుమానంగానే మారింది. ఇప్పటి వరకు చాలాచోట్ల నారుమడులు సిద్ధంగా లేవు. మరికొన్ని చోట్ల సిద్ధం చేసుకొని నీరు రాకపోవడంతో నారు ముదిరిపోతుందని ఆందోళన చెందుతున్నా రు. కేఎల్ఐ, భీమా ఎత్తిపోతల నీళ్లు వస్తున్నా గ తం లో ఊహించినంత వేగంగా రావడం లేదు.
రైతులంతా సాగునీరు రావడం లేదంటూ ఆందోళనలు చెందుతున్న సమయంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఆయా పంట కాల్వలను అనుసరించి నీళ్ల రాకపోకలను గమనించారు.
పది రోజులైనా డీ-8 ద్వారా పాన్‌గల్ ప్రాంతానికి నీరు రాకపోవడంతో ఇరిగేషన్ అధికారులను మంత్రి వాకబు చేశారు. అలాగే ఎమ్మెల్యే మేఘారెడ్డి నియోజకవర్గంలో పెద్దమందడి బ్రాంచి కెనాల్, ఖిల్లాఘణపురం బ్రాంచి కెనాల్‌ను పరిశీలించారు. చిన్నారెడ్డి డీ-8 కాల్వలను పరిశీలించడం జరిగింది. అయితే, నీళ్లు వేగంగా రాకపోవడం తో కాల్వల పూడికలను తొలగిస్తే వేగంగా వస్తాయ ని చెప్పడంతో అటువైపు మళ్లారు.
కాల్వల్లో పూడిక పేరుకుపోవడం వల్లే నీరు వేగంగా రావడం లేదని గుర్తించిన మంత్రి, ఎమ్మెల్యే పూడిక తీయాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల మంత్రి జూపల్లి కలెక్టరేట్లో ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. దీంతో అక్కడక్కడా కొన్ని చోట్ల హిటాచీలను ఏర్పాటు చేసి పూడికల తొలగింపునకు శ్రీకారం చుట్టారు. పనులు కూడా అనుకున్నంత వేగంగా జరగడం లేదు.
పెద్దమందడి బ్రాంచి కెనాల్లో గురువారం పూడికతీత పని నడిచింది. సోలీపూర్ నుంచి దాదాపు వీరాయిపల్లి వరకు కొనసాగింది. శుక్రవారం పని నడవలేదని అక్కడి గ్రామాల రైతులు చెబుతున్నారు. అలాగే బీమా-2లోని 16వ ప్యాకేజీలోనూ నత్తనడకన పూడికతీత పనులు సాగుతున్నాయి. పుల్గర్‌చర్ల శివారులో మాత్రమే పూడిక తీత కొనసాగింది. ఇక డీ-8 కెనాల్లో పూడిక అలికిడే లేదు. ఇలా మందకొడిగా సాగుతున్న పనులతో ఎప్పుడు సాగునీరు వస్తుందోనని రైతులు ఎదురు చూస్తున్నారు.
కృష్ణానదిని వరదలు ముంచెత్తుతుంటే.. శ్రీరంగాపురం రిజర్వాయర్ మాత్రం ఇప్పటికీ నిండడం లే దు. నెల రోజుల నుంచి ఏనుకుంట రిజర్వాయర్ ద్వారా రంగసముద్రానికి నీటి విడుదల కొనసాగుతున్నది. 350 క్యూసెక్కుల నీటిని ఈ రిజర్వాయర్ కు తరలిస్తున్నారు. ఏనుకుంట నుంచి రిజర్వాయర్ వరకు దాదాపు 30కిలోమీటర్ల దూరం ఉంది. దీని పొడవునా 12వేల ఎకరాల ఆయకట్టు ఉంటే, మరో 10వేల వరకు అనధికార సాగుబడులుంటాయి. దీంతో ఈ కాల్వలో వచ్చే నీళన్నీ ఆయకట్టు రైతులే తీసుకుంటున్నారు. కేవలం 100 క్యూసెక్కుల నీరు కూడా రంగసముద్రం రిజర్వాయర్‌కు రావడం లేదు. అందువల్లే నెల రోజులు గడిచినా మూడు మీ టర్ల నీరు మాత్రమే రిజర్వాయర్‌లో పెరిగింది.
దీం తో 16వ ప్యాకేజీకి నీళ్లు విడుదల చేయాలంటే సరైన నీటి నిల్వ రిజర్వాయర్‌లో ఉండాలి. ప్రస్తుతం రిజర్వాయర్‌లో 320.4 మీటర్ల లెవెల్లో నీరుంది. ముందున్న గ్రామాలకు సాగునీరు వేగంగా వెళ్లాలం టే కనీసం రిజర్వాయర్‌లో 322 మీటర్ల వాటర్ లెవె ల్ ఉండాలి. ఇక్కడి నుంచి దాదాపు 76 కిలోమీటర్ల 16వ ప్యాకేజీలో కెనాల్ ఉంది. వీటి కింద ఐదు మండలాల గ్రామాలున్నాయి. నీటిమట్టం పెరగాలం టే ఇంకా ఎంత గడువు తీసుకుంటుందో తెలియని పరిస్థితి. ఏనుగుంట నుంచి మరో ప్రత్యేక కెనాల్ ఏ ర్పాటు చేయడమా లేదా ఉన్న కాల్వను మరింత వెడల్పు చేయాలి. అలా చేయనంత వరకు వర్షాల ప్రభావం అంతంతగా ఉన్నప్పుడు రంగసముద్రం నీటిని నమ్ముకున్న రైతులు నట్టేట మునగాల్సిందే.