అచ్చంపేట, మార్చి 2 : అచ్చంపేట డివిజన్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు ప్రముఖ టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ శుభవార్త చెప్పారు. 9, 10వ తరగతుల్లో ఫస్ట్, సెకండ్ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు స్కాలర్షిప్ అందజేయనున్నట్లు ప్రకటించారు. విజయ్ దేవరకొండ ట్రస్ట్ ద్వారా అచ్చంపేట డివిజన్లోని 44 ప్రభుత్వ పాఠశాలల్లో మొదటగా ప్రారంభిస్తున్నామని.. తర్వాత నాగర్‌కర్నూల్ జిల్లా.. అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించనున్నట్లు ప్రకటించారు. తుమ్మెన్‌పేటలో సోమవారం జరిగిన వివాహ విందు ఆత్మీయత, ఆనందం మధ్య జరిగింది.
అంతకుముందు హైదరాబాద్ నుంచి ఉదయం 9:30 గంటలకు సొంతూరుకు నవ దంపతులు చేరుకోగానే స్థానికులు ఘన స్వాగతం పలికారు. మహిళలు హారతిపట్టి, బొట్టుపెట్టి ఆహ్వానించగా.. కోలాటాలు, డప్పు చప్పుళ్ల మధ్య నృత్యాలు, సంప్రదాయ కళారూపాలతో గ్రామమం తా పండుగ వాతావరణాన్ని సంతరించుకున్నది. తుమ్మెన్‌పేటలో 8 ఎకరాల ఫాంహౌస్‌లో అధునాత భవనం నిర్మించగా.. వీరోష్ దంపతులు పూజలు, సత్యనారాయణస్వామి వ్రతం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం అభిమానులను కలిసి పలకరించారు.
ఈ సందర్భంగా కీలక ప్రకటన చేస్తూ.. తన తండ్రి కోరిక మేరకు సొంతూరులో ఇల్లు, ఫాంహౌస్ నిర్మించామని తెలిపారు. ఇప్పుడు కూడా ఆయన కోరిక మేరకే పూజలు, విందు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ గ్రామానికి ఇంకా చాలా చేయాల్సి ఉందని, భవిష్యత్‌లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు. నా మొదటి పుట్టినరోజు ఇక్కడే జరిగింది.. తర్వాత హైదరాబాద్‌కు వెళ్లామని గుర్తు చేశారు. ఇకపై అప్పుడప్పుడు గ్రామానికి వస్తానని వెల్లడించారు.
ఆశీర్వదించిన ప్రముఖులు
బల్మూరు, మార్చి 2 : ప్రముఖ సినీ హీరో విజయ్‌దేవరకొండ, రష్మిక రిసెప్షన్ వేడుక సోమవారం మండలంలోని తుమ్మెన్‌పేట గ్రామంలోని ఫాంహౌస్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యనారాయణస్వామి వ్రతం నిర్వహించగా కలెక్టర్ బదావత్ సంతోష్ దంపతులు హాజరై విజయ్, రష్మికలను ఆశీర్వదించి జ్ఞాపికను అందజేశారు. అదే విధంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి,పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు హాజరై వారిని ఆశీర్వదించారు.