మాడ్రిడ్: యూరోప్‌లో హీట్‌వేవ్ వల్ల కార్చిచ్చు(Europe Wildfires) విస్తరిస్తోంది. స్పెయిన్, ఫ్రాన్ దేశాల్లో అడువులు శరవేగంగా అంటుకుంటున్నాయి. మంటలు కూడా దట్టంగా వ్యాపిస్తున్నాయి. ఈసారి వేసవి కాలంలో.. దావానలం వ్యాపిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తున్నది. భీకరంగా ఎగిసిపడుతున్న కార్చిచ్చును అదుపు చేయడం ఫైర్‌ఫైటర్లకు కష్టంగా మారుతోంది. అయితే వెదర్లో వస్తున్న మార్పుల వల్లే ఈ సమస్య ఉత్పన్నం అయినట్లు తెలుస్తోంది.
వాతావరణ మార్పులు యూరోప్ దేశాలను దహించి వేస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి ఈసారి చలి కాలంలో యూరోప్ దేశాల్లో కావాల్సినంత వృక్ష సంపద పెరిగింది. అయితే ఆ తర్వాత వసంత రుజువు చాలా పొడిగా ఉండిపోయింది. దీనికి తోడు వేసవి కాలం ముందే వచ్చేసింది. ఆ తర్వాత పదేపదే హీట్‌వేవ్స్ రావడంతో.. ఆ వృక్ష సంపద చాలా త్వరగా ఎండిపోయిందని, దాంతో కార్చిచ్చు కూడా వేగంగా విస్తరిస్తున్నట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు.
గడ్డి, ఆకులు, చిన్నపాటి కొమ్ములు చాలా వేగంగా అంటుకుంటున్నాయి. చాల రోజుల నుంచి వేడి ఉష్ణోగ్రతలు ఉండడం వల్ల వాతావరణంలో తేమ కోల్పోయింది. దీంతో చెట్లు ఈజీగా మంటకు అంటుకునే రీతిలో తయారై ఉంటాయని భావిస్తున్నారు. వీటికి తోడు బలమైన గాలులు, ఆ గాలులు పదేపదే దిశ మారడం వల్ల మంటలు ఊహించని రీతిలో వ్యాప్తి చెందుతున్నట్లు అంచనా వేశారు.
భీకర స్థాయిలో వచ్చే కార్చిచ్చు తన స్వంత గాలులను సృష్టిస్తుంది. ఆ గాలులు మరింత వేడని పుట్టంచి.. వేగంగా, బలంగా దావానలం వ్యాప్తి అయ్యేలా చేస్తున్నాయని నిపుణులు అంటున్నారు. యూరోప్‌పై వాతావరణ మార్పుల ప్రభావం ఎక్కువగా ఉందని, దీని వల్లే వేగంగా కార్చిచ్చు విస్తరిస్తోందని, హెక్టార్ల కొద్ది అడవులు తక్కువ సమయంలో దగ్ధం అవుతున్నట్లు అనుమానిస్తున్నారు.
ఫ్రాన్స్‌లోని గిరోండే ప్రాంతంలో ఉన్న బోర్డియాక్స్ సిటీలో ప్రస్తుతం తీవ్ర స్థాయిలో దావానలం ఉన్నది. ఆ ప్రాంతానికి చెందిన శాటిలైట్ ఇమేజ్‌లను రిలీజ్ చేశారు. వేల ఎకరాల్లో ఉన్న అటవీ ప్రాంతం కాలిపోతున్నట్లు శాటిలైట్ ఫోటోల ద్వారా గుర్తించారు. రెండు దేశాల్లో ఇప్పటికే 3 లక్షల మందిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. వేల సంఖ్యలో జనం స్పోర్ట్స్ హాల్స్, ఎగ్జిబిషన్ సెంటర్లలో తలదాచుకుంటున్నారు.
గిరోండే ప్రాంతంలో సుమారు 2500 మంది ఫైర్ ఫైటర్లు, 1500 మంది సైనికులు, 1200 మంది పోలీసులు మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఫ్రాన్స్, స్పెయిన్‌లో వేడి వాతావరణం ఉన్నది. అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో ఆ దేశాల్లో ఇప్పట్లో కార్చిచ్చు అదుపులోకి వచ్చే సూచనలు కనిపించడంలేదు.