అమరచింత, ఏప్రిల్ 08 : దేశంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలు ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని సీపీఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు రాజు, రాజన్న, సామేలు అన్నారు. వనపర్తి జిల్లా అమరచింత మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మీడియాతో మాట్లాడారు. ఈ నెల 8న కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సీపీఐఎంఎల్ మాస్ లైన్ కేంద్ర పార్టీ పిలుపుమేరకు దేశంలోని అన్ని జిల్లా కేంద్రాలలో నిరసన కార్యక్రమాలను చేపడుతామన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు యేటా కోటి ఉద్యోగాలు కల్పించి నిరుద్యోగ నిర్మూలన చేపడతామని, అలాగే రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని పేద ప్రజలకు ఎన్నో ఆశలు కల్పించారు.
అధికారం చేపట్టిన అనంతరం రైతులను ఇబ్బందులు పెట్టేలా కార్పొరేట్ శక్తులకు మద్దతు పలికేలా రైతు చట్టాలను తీసుకువచ్చారని విమర్శించారు. ఈ ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసన కార్యక్రమంలో భాగంగా 8వ తేదీన నారాయణపేట జిల్లా కేంద్రంలో చేపట్టనున్న ఆందోళన కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. అనంతరం నిరసన కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికను వారు విడుదల చేశారు.