వనపర్తి, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ) : రాబోయే రోజుల్లో జరిగే ఏ ఎన్నికలైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజాగ్రహం తప్పదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి హెచ్చరించారు. బుధవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని గాంధీనగర్‌లో గల్లీగల్లీలో స్థానికులకు కాంగ్రెస్ బాకీ కార్డులను ఆయన పంపిణీ చేశారు. ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుండడంతో బీఆర్ఎస్ నాయకులు బాకీ కార్డుల పంపిణీలో జోరు పెంచారు. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అమలుకు సాధ్యం కాని గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని ధ్వజమెత్తారు.
అధికారంలోకి వచ్చాక గ్యారెంటీలను గాలికొదిలేశారని మండిపడ్డారు. ప్రజలకు కాంగ్రెస్ పడ్డ బాకీలు చెల్లించే వరకు రేవంత్ సర్కారును వదిలేది లేదని హెచ్చరించారు. ప్రతి కుటుంబానికి ప్రభుత్వం ఎంత బాకీ పడిందో ఓ కార్డు ద్వారా ఎనిమిది పథకాలతో ప్రజలకు వివరించే ప్రయత్నంలోనే భాగంగానే ప్రతి ఇంటినీ పలుకరిస్తున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఓటు అనే ఆయుధంతోనే కాంగ్రెస్‌కు సమాధానం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, అధికార ప్రతినిధి శ్రీధర్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు రమేశ్‌గౌడ్, నాయకులు పాల్గొన్నారు.