కొత్తకోట: మండలంలోని కానాయపల్లి స్టేజి వద్ద ఉన్న సుప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీకోటిలింగేశ్వర దత్త దేవస్థానం పద్దెనిమిదో వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. సోమవారం నుంచి ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాలు మూడు రోజులపాటు కొనసాగనున్నాయి. బ్రహ్మోత్సవాలు మూడురోజులపాటు వైభవంగా జరుగుతాయని ఆలయ కమిటీ వెల్లడించింది. మొదటి రోజైన సోమవారం దేవాలయ ఆవరణలో సామూహిక కోటి నవధాన్య రుద్ర సహిత నవగ్రహ హోమాలు నిర్వహించనున్నారు. అనంతరం భక్తులకు అన్నదానం వుంటుంది. ఈ కార్యక్రమానికి పశ్చిమాద్రి సంస్థాన విరక్త మఠం నేరేడుగం సిద్దిలింగేశ్వర మహాస్వాములవారు హాజరుకానున్నారు.
రెండో రోజు శివపార్వతుల ఉత్సవ విగ్రహాలకు లక్ష పుష్పార్చన వుంటుంది. మూడో రోజైన బుధవారం శివపార్వతుల కళ్యాణం నిర్వహించి అన్నదానం వుంటుంది. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో పుష్పమాలలతో అలంకరణ చేశారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉండటంతో ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేశారు.