నాగర్‌కర్నూల్, మార్చి 21 : కాంగ్రెస్ ఎన్నికలకు ముం దు ఆర్భాటంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయడంలో వైఫల్యం చెందిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరో సా, రుణమాఫీ, కొత్త పింఛన్లు, నూతన రేషన్ కార్డులు అ ర్హులకంటే అనర్హులైన అధికార పార్టీ నాయకులకే వందశా తం అమలైనట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ స్కీ ములును అమలు చేసేందుకు మండలానికో పైలట్ గ్రా మాన్ని జనవరి 26వ తేదీన ఎంపిక చేశారు. మంజూరుచేసే అభివృద్ధి పథకాలను వివరిస్తూ గ్రామసభలు కూడా నిర్వహించారు.
కొన్ని చోట్ల జాబితాలు ఎంపిక చేసి అర్హుల పేర్లు ప్రకటించారు. పథకాల్లో అనర్హుల పేర్లు జాబితాలో ఉన్నాయని, అర్హులకు మోసం చేశారని, ఇల్లు ఉన్న వారికే ఇల్లు మంజూరు చేశారనే వివిధ రకాల కారణాలు చూపుతూ ప్రజలు గొడవకు దిగిన విషయం తెలిసిందే. అప్పట్లో అధికారులు చేసేది లేక దరఖాస్తు చేసుకున్న అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ఆలస్యమైనా పథకాలు అందుతాయనే హామీతో సమావేశాలను ముగించారు. ఇక తర్వాత తాము ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొందవచ్చని అంతా అనుకున్నారు. కానీ ఎంపిక చేసిన గ్రామాల్లో పథకాల అమలు అటకెక్కింది.
పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన గ్రామాల్లో పథకాలు పూర్తిస్థాయిలో అమలు పరచడం అధికారులకు తలనొప్పిగా మారింది. ఒక్కో ఇంట్లో ఇద్దరు ముగ్గురు అర్హులు ఉంటే ఒకరికే పథకం వర్తింపజేయడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికైన నాగర్‌కర్నూల్ మండలం పెద్దాపూర్‌లో ఇలాంటి సమస్యే ఎదురవుతోంది. ఒక ఇంట్లో ఇందిరమ్మ ఇల్లు పొందేందుకు ముగ్గురు ఉంటే ఒకరికే మొదటి విడుతగా ఇస్తుండడంతో మిగతా అర్హులైన ఇద్దరు లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. పథకాలు అందరికీ అందుతాయనుకున్న ఈ గ్రామస్తులకు నిరాశే మిగిలింది.
గ్రామం మొత్తంలో 41 మందికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయగా ఇద్దరున్న ఇంట్లో ఒకరికి మాత్రమే మొదటి విడుతగా ఇల్లు వస్తుందని చెప్పడంతో మిగతా వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇందిరమ్మ భరోసాకు ఏడాదికి రూ.12 వేలు పొందేందుకు కేవలం ఏడుగురు మాత్రమే ఎంపికయ్యారు. ఇందుకు ఉపాధి పథకంలో పనిచేస్తూ భూమిలేని అర్హులను ఎంపిక చేసేందుకు మెలిక పెట్టడంతో ఈ పథకం ద్వారా లబ్ధిపొందే అర్హులు పూర్తిగా తగ్గిపోయారనే చెప్పవచ్చు. ఇక రైతు భరోసా ఎకరానికి రూ.6 వేల చొప్పున ఇస్తున్న పెట్టుబడి సాయం కూడా అంతంత మాత్రంగానే అందుతుందని రైతులు నిరాశతో ఉన్నారు. కొత్తరేషన్ కార్డులకోసం ఇప్పటికి 30 కుటుంబాలను గుర్తించినా అవి అందకపోగా, ఇంకా మీసేవ, గ్రామసభల ద్వారా దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు కొత్త కార్డులు అందలేదు.
ఉన్న కార్డుల్లో తమ పిల్లల పేర్లను చేర్చడంలో తాత్సారం జరుగుతోంది. ఇప్పటికీ చాలా మంది పాత రేషన్ కార్డుదారుల్లో కొత్త వారి పేర్లు చేర్చకపోవడం ఏమిటని ప్రజలు నిలదీస్తున్నారు. ఏదేమైనా పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన గ్రామాల్లోనే అభివృద్ధి కొరవడడం, పథకాలు పూర్తిస్థాయిలో లబ్ధిదారులకు అందకపోవడంపై మిగతా గ్రామాల్లో అర్హుల పరిస్థితి రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందనేది ప్రజలు చర్చించుకుంటున్నారు. కాగా సర్పంచుల పదవీ కాలం పూర్తవడంతో గ్రామాల్లో పారిశుధ్య లోపం కనిపించింది. పలు వీధుల్లో డ్రైనేజీలు చెత్తతో నిండుకున్నాయి. పండుగొస్తెనే డ్రైనేజీలు తీస్తారని స్థానికులు పేర్కొనడం విశేషం. కురువ గేరిలో నిర్మించిన శ్మశాన వాటిక వాడుకలో లేక, భద్రత లేక పిచ్చిమొక్కలతో దర్శనమిస్తున్నది. ఏడాది కిందట ప్రారంభించిన ఈ వాటికకు ఆలనాపాలన కరువైంది.
నాకు ఇందిరమ్మ ఇల్లు కావాలి నాగర్‌కర్నూల్ మండలం నాకు ఉన్న పాత ఇల్లు కూలి పోయింది. ఇద్దరు కొడుకులతో పూరిగుడిసెలో ఉంటున్నారు. మా గ్రామంలో ఇండ్లు వస్తాయని అధికారులు చెప్పిండ్రు. ఇప్పుడేమో మా పెద్ద కొడుక్కి మాత్రమే ఇల్లు వచ్చిందంటున్నరు. నాకు తర్వాత వస్తదని చెబుతున్నరు.. కానీ నమ్మకం లేదు. వాన పడితే పూరి గుడిసెలో ఉండడానికి ఇబ్బందులు పడుతున్నా. నాకూ ఇందిరమ్మ
ఇల్లు ఇయ్యాలె.
– దేవమ్మ, పెద్దాపూర్, నాగర్‌కర్నూల్ జిల్లా
కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నా రాలేదు. మూడు, నాలుగు సార్లు ఆన్లైన్లో
ఐప్లె చేసినా.. అధికారులకు దరఖాస్తు చేసుకున్నా కార్డు మంజూరు కాలేదు. అధికారులను అడిగితే
వస్తదని చెబుతున్నారు.. కొంత మందికి ఎమ్మెల్యే ప్రొసీడింగ్‌లు ఇచ్చినా.. మిగితా వారికి ఇవ్వలేదు.. అసలు వస్తదో లేదో తెలియని పరిస్థితి.
– ఆంజనేయులు, ఇబ్రహీంబాద్, హన్వాడ మండలం, మహబూబ్‌నగర్
ఇందిరమ్మ ఇల్లు వచ్చిదంటే ఎంతో సంతోషపడ్డా.. కానీ ఇల్లు నిర్మాణం కోసం అధికారులు ముగ్గుపోస్తా
రని చెబుతున్నారు.. కానీ ఎప్పుడు వస్తారో.. ఎప్పుడు ముగ్గు పోస్తారో.. తెలియని పరిస్ధితి. ఇల్లు లేకపోవడంతో ఇప్పుడు గుడిసెలోనే జీవనం గడుపుతున్నాం. త్వరగా ఇల్లు నిర్మిస్తే బాగుంటుంది. మాకు ఇచ్చిన ఇంటి ప్రొసీడింగ్‌పై కలెక్టర్ సంతకంలేదు.
– జ్యోతి, ఇబ్రహీంబాద్, హన్వాడ మండలం