మదనాపురం : తమకు రావాల్సిన పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న మాజీ సర్పంచ్లను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. దీనిపై మదనాపురం మండలంలోని వివిధ గ్రామాల మాజీ సర్పంచ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సర్పంచులను అక్రమ అరెస్టులతో మండల కేంద్రంలోనే అడ్డుకోవడం సిగ్గుమాలిన చర్య అని మండిపడ్డారు,
అక్రమ అరెస్టులతో అణగదొక్కడం ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనమని, పల్లె ప్రకృతి వనం బిల్లులను వైకుంఠధామం బిల్లులను పెండింగ్లో పెట్టి, నిత్యం ప్రజల్లో ఉండి పనిచేసే సర్పంచులను, వారి కుటుంబాలను రోడ్డుపైకి లాగే ప్రయత్నం చేస్తున్న ఈ ప్రభుత్వానికి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం ఖాయమని అన్నారు.
మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో మండల మాజీ సర్పంచ్ల సంఘం అధ్యక్షులు కురుమూర్తి, నెలివిడి మాజీ సర్పంచ్ కోట్ల తిరుపతయ్య, తిరుమలాయ పల్లె మాజీ సర్పంచ్ TK కృష్ణ, దుప్పల్లి మాజీ సర్పంచ్ శివశంకర్ నాయుడు, శంకరంపేట మాజీ సర్పంచ్ రాజ్ కుమార్ పాల్గొన్నారు.