గద్వాల అర్బన్, జనవరి 4 : ధాన్యం వ్యవహరంలో రైస్ మిల్లర్లు అవకతవకలకు పాల్పడుతున్నట్లు గత కొంతకాలంగా జిల్లాలో పెద్దమొత్తంలో ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో గత నెల జిల్లాలోని బీచుపల్లి సమీపంలోని విజయ ఆయిల్ మిల్ గోదాంలో 300 బస్తాల ధాన్యం మాయం అవ్వడంతో ఈ విషయాన్ని ‘నమస్తే తెలంగాణ’ పత్రిక వెలుగులోకి తెచ్చింది. 300 బస్తాల ధాన్యం ఎవరు తీశారన్న విషయంపై సివిల్ సప్లయ్, పోలీస్ అధికారులు విచారణ చేపట్టి అందులో కీలకమైన వ్యక్తులపై కేసు నమోదు చేసి ధాన్యంతోపాటు వాహనాన్ని సీజ్ చేసిన అనంతరం వ్యక్తులను అరెస్ట్ చేశారు. అయితే ఈ వ్యవహరం ఈ ఒక్క మిల్లులో కాకుండా జిల్లాలోని చాలా రైస్ మిల్లుల్లో నడుస్తున్నట్లు విజిలెన్స్ అధికారులకు తెలిసింది. రైతుల నుంచి మిల్లర్లు సన్న ధాన్యం సేకరించి వాటిని అధికధరకు విక్రయించి తక్కువ ధరకు వచ్చే ధాన్యాన్ని మళ్లీ కొనుగోలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలో విజిలెన్స్ అధికారులు ఏ మిల్లుకు ఎంత ధాన్యం వచ్చింది..? ఎంత బియ్యాన్ని ప్రభుత్వానికి అందించారన్న విషయాలను తెలుసుకునేందుకు గత నాలుగైదు రోజులుగా జిల్లాలో ఆయా రైస్ మిలుల్లో రహస్యంగా తనిఖీలు చేస్తున్నట్లు తెలిసింది. శనివారం కూడా ఎర్రవల్లిలోని ఓ రైస్ మిల్లుతోపాటు కేటీదొడ్డి మండలంలోని ఓ రైస్ మిల్లులో గంటల తరబడి తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం. విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో రైస్ మిల్లుల నుంచి కీలక విషయాలను వెలుగులోకి వచ్చిన్నట్లు గుసగుసలు వినబడుతున్నాయి.
రైతుల నుంచి వచ్చిన ధాన్యం బయట అధిక ధరలకు విక్రయించినట్లు అలాగే.. వాటి స్థానంలో తక్కువ ధరతో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ర్టాల నుంచి వచ్చిన వరి ధాన్యం తెచ్చినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. వీటి వ్యవహరంపై మిల్లర్లతో అధికారులు చర్చిస్తున్న క్రమంలో మిల్లర్లు నీళ్లు నమ్ములుతూ పొంతన లేని సమాధానాలు చెబుతున్నట్లు తెలిసింది. అయితే విజిలెన్స్ అధికారులు రహస్యంగా మిల్లులపై తనిఖీ చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న మిల్లర్లు కొంత మంది మిల్లులో అందుబాటులో ఉండకుండా రహస్య ప్రదేశాలకు వెళ్లినట్లు తెలిసింది.
అయితే విజిలెన్స్ అధికారులు తనిఖీలకు వస్తున్న విషయాన్ని సివిల్ సప్లయ్ ధికారులే మిల్లర్లకు సమాచారం ఇస్తున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. సివిల్ సప్లయ్ అధికారుల సహకారంతోనే రైస్ మిల్లర్లు విచ్చల విడిగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. వీరికి పెద్దమొత్తంలో మిల్లర్లు మామూళ్లు ఇస్తున్నట్లు తెలిసింది. దీనిపై సివిల్ సప్లయ్ అధికారి స్వామి కుమార్ను వివరణ కొరేందుకు ప్రయ త్నం చేయగా.. స్పందించడం లేదు.