మహబూబ్‌నగర్, మే 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/భూత్పూర్ : ఆ రైతు పేరు కుమ్మరి తి రుపతయ్య. మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలం తాటిపర్తి గ్రామం.. ఈనెల 8వ తేదీన పంట కోత కోయగా.. మొత్తం 480 బస్తాలు దిగుబడి వచ్చింది. ఇక ఆ రైతులో మురిపెం కనపడింది. కానీ సర్కారు నిర్లక్ష్యం.. పంట కొనుగోలులో జాప్యం ఆ రైతుకు శాపంగా మారింది. కోత కోసిన తర్వాత మూడు రోజులు వరి ధా న్యాన్ని ఆరబెట్టారు.. ఇక కొనుగోలు కేంద్రానికి తరలించి అమ్ముకొని సొమ్ము చేసుకుందామనుకున్న ఆ రైతు ఆశలు అడియాశలయ్యాయి. ధా న్యాన్ని తీసుకువెళ్తే మాయిశ్చర్ వచ్చింది చూడమంటే అప్పుడప్పుడు అని ఆలస్యం చేశారు.
మాయిశ్చర్ చూసిన తర్వాత నింపడానికి సంచుల్లేవంటూ మరో మూడ్రోజులు ఆలస్యం చేశారు. సంచులు వచ్చే సరికి వర్షం పడి వడ్లు తడిసిపోయాయి. నానిన వడ్లను మళ్లీ ఆరబెట్టి తేమ చూడమంటే మరో రెండ్రోజులు చేశారు. మరో మూడ్రోజులు లారీలు లేవని ఆపారు. మళ్లీ వర్షం వచ్చి వడ్లు తడిసిపోయాయి. వాటిని మళ్లీ ఆరబోసి మాయిశ్చర్ చూపించిన తర్వాత సంచిలోకి నింపారు.. చివరకు లారీలు లేవని మళ్లీ ఆపడంతో సొంతంగా ట్రాక్టర్ రోజుకు రూ.3 వేలు కిరాయికి మాట్లాడుకుని ట్రాక్టర్లో వేసుకొని పోతులమడుగు రైస్‌మిల్లుకు తీసుకొచ్చాడు.. అక్కడే ఆ రైతుకు అసలు కష్టం మొదలైంది.
ఒక క్వింటాకు 19 కిలోల తరుగు తీస్తున్నారు. ఇదేమిటని అడిగితే ‘నీ ఇష్టం ఉంటే ఇచ్చి పో.. లే దంటే నీ ఇష్టం.. ఎక్కడైనా అమ్ముకో’ అని మిల్లు యజమానులు బెదిరించారని రైతు ఆవేదన చెందాడు. ఇప్పటికే ఐదు రోజులు గడిచింది.. ట్రాక్టర్ యజమానేమో ఇప్పుడు రోజుకు రూ.5 వేలు ఇవ్వమంటున్నాడు.. ఏం చేయాలో అర్థం కాక రైస్ మిల్ యజమానులు రాసిచ్చిన కాగితాన్ని చేత పట్టుకుని ఎప్పుడు ఖాళీ చేస్తారోనని పడిగాపులు కాశాడు. ఈ పరిస్థితి చూసి మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి చలించిపోయారు. వెంటనే మిల్లర్ల దోపిడీపై మీడియాకు వివరించారు. అధికార యంత్రాంగం మాత్రం పంట కొనుగోలు చేస్తున్నట్లు తడిసిన ధాన్యం కొంటున్నట్లు ప్రకటనలకే పరిమితమైతుందని ఈ రైతు కథ చూస్తే అర్థమవుతుంది. ఇప్పటికే తరుగు తీసి ట్రాక్టర్ కిరాయిలు కడితే ఇక మిగిలేది ఏముందని రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్న పరిస్థితి కల్పిస్తోంది.
ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో తీవ్ర నిరాశకు గురైన రైతు తిరుపతయ్య చివరకు రైస్ మిల్లర్లు చేస్తున్న దోపిడీని వీడియో తీశారు. ఎంత బతిమలాడుతున్న తరుగు 19 కిలోలు తీస్తామని అవసరమైతే నీకోసం ఒక కేజీ తక్కువ తీస్తామని బెదిరింపులకు దిగిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయినప్పటికీ కూడా ధాన్యా న్ని దింపుకోకుండా రైస్ మిల్లర్ యజమాని రైతుకు బెదిరింపులకు దిగడం ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. అయినా మొక్కవోని ధైర్యంతో రైతు రైస్ మిల్లర్ యజమానితో పోరాడుతున్న ఆ వీడియో పలువురిని కదిలిస్తోంది.
తరుగు, లంచం పేరుతో రైతులను కొనుగోలు కేంద్రం నిర్వహకులు, రైస్ మిల్లర్లు నిలువు దోపిడీ చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన ‘నమస్తే తెలంగాణ ప్రతినిధి’తో మాట్లాడుతూ ప్రభుత్వం కొనుగోలు విషయంలో నిర్లక్ష్య వైఖరి కారణంగానే రైతులు తీవ్రంగా నష్టపోతున్నా రన్నారు. పంట ఎంత సాగయ్యింది.. ఎంత దిగుబడి వస్తుంది.. ఎన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలనే దానిపై ప్రభుత్వం వద్ద ప్రణాళిక లేకపోవడమే ఈ పరిస్థితి కారణం అన్నారు. కొనుగోలు కేంద్రాల ఇన్చార్జీలు రైతుల వద్ద బస్తాకు రూ.15 డిమాండ్ చేస్తున్నారన్నారు.
తరుగు పేరుతో మిల్లర్ల దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోయిందన్నారు. రైతులు ఇంత దోపిడీకి గురవుతున్నా ఇటు అధికారులు, అటు ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదన్నారు. వారం రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలని, తడిసిన ధాన్యం కూ డా మొత్తం కొనాలని లేదంటే పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.