మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల(పీఆర్ఎల్ఐ)లో భాగంగా నిర్మిస్తున్న వట్టెం పంప్‌హౌస్ నీట మునిగింది. కాగా, ఈ మునకకు సంబంధించి షాకింగ్ విషయాలు బయటకొస్తున్నాయి. కాంట్రాక్టర్లు, అధికారుల నిర్లక్ష్యమే పంప్‌హౌస్ ము నకకు కారణంగా తెలుస్తున్నది.
సుమారు 20 కిలోమీటర్ల మేర నిర్మించిన సొరంగాల్లో 35 లక్షల క్యూసెక్కుల నీరు చేరిందని అంచనా. ఇంత పెద్ద ఎత్తున నీరు చేరుతున్నా.. ఇటు కాంట్రాక్టర్లు, అటు అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తున్నది. నిండా మునిగాక అధికారులు చర్యలు చేపట్టడం వెనుక ఉన్న మతలబేమిటో అర్థం కావడం లేదు. పీఆర్‌ఎల్‌ఐని ప్రభు త్వం పట్టించుకోకపోవడం వల్లే అధికారులు కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నాగర్‌కర్నూల్ జిల్లా నాగనూలు, కుమ్మెర చెరువులు ఉప్పొంగాయి. దీంతో వట్టెం రిజర్వాయర్‌కు రెండు వైపుల నుంచి సొరంగాల్లోకి వరద చేరింది. ఈ నీరంతా టన్నెళ్ల నుంచి సర్జిపూల్‌లోకి రావడంతో వేగంగా నిండింది. అయితే, ఈ నీటిని అడ్డుకునేందుకు గేట్లు లేకపోవడంతో నీటిమట్టం పెరిగి పంప్‌హౌస్‌లోకి మళ్లింది. పంప్‌హౌస్‌లో రెండు అంతస్తులు నీట మునిగి మోటర్లలో చేరి నీళ్లు ఊబికి వచ్చాయి. పెద్ద ఎత్తున నీరు రావడంతో సోమ, మంగళవారాల్లో మోటర్లు బిగిస్తున్న బీహెచ్ఈఎల్ కంపెనీ టెక్నికల్ సిబ్బంది గమనించి అధికారులను అప్రమత్తం చేసినట్లు తెలుస్తున్నది. దీంతో అధికారులు ఉన్న కొద్దిమంది సి బ్బందిని బయటికి పంపించేశారు. అయితే, అప్పటికే నష్టం జరిగిపోయింది.
నాగర్‌కర్నూల్ జిల్లా వట్టెం పంప్‌హౌస్ నీట ము నగడంతో భారీ ఎత్తున నష్టం వాటిల్లినట్లు సమాచా రం. అయితే, ఈ విషయంపై ఇటు అధికార యం త్రాంగం కానీ అటు కాంగ్రెస్ సర్కార్ కానీ స్పందించడం లేదు. సొరంగాల్లో ఉన్న మిషనరీతోపాటు సర్జిపూల్, పంప్‌హౌస్‌లలో ఉన్న సామగ్రి కూడా నీటమునిగింది. కేసీఆర్ సర్కార్ మారాక.. కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించిన నిధులకు అనుగుణంగా పనులు చేపడుతున్నారు. దీంతో పర్యవేక్షణ లేక అంచనాలకు అందని నష్టం వాటిల్లింది.
పీఆర్ఎల్ఐలో భాగంగా పనులు చేపడుతున్న మెగా కంపెనీ.. వట్టెం పంప్‌హౌస్, రిజర్వాయర్ పనులను సబ్ కాంట్రాక్టర్‌కు అప్పగించింది. ఏదుల నుంచి వట్టెం వరకు సుమారు 25 కిలోమీటర్ల సొరంగ మార్గం ఉన్నది. వట్టెం పంప్‌హౌస్‌కు వచ్చే సొరంగమార్గాల సమీపంలో అనేక చెరువులు, కుంటలు ఉన్నాయి. సొరంగాల్లోని రాళ్లను బయటకు తీసేందుకు.., లోపలికి వెళ్లేందుకు అనేకచోట్ల మార్గాలను ఏర్పాటు చేసుకున్నారు.
ఇందులో భా గంగానే నాగర్‌కర్నూల్ సమీపంలోని నాగనూలు, శ్రీపురం గ్రామాల మధ్యలో కూడా సొరంగమార్గం ఉన్నది. అయితే, ఇటీవల కురిసిన వర్షాలకు నాగనూల్ పెద్ద చెరువు ఉప్పొంగింది. చెరువు వెనుక భాగంలోనే సొరంగ మార్గం ఉన్నది. చెరువుకు అడ్డంగా ఉన్న కట్ట తెగిపోవడంతో నీళ్లన్నీ సొరంగంలోకి వెళ్లాయి. ఈ విషయాన్ని అక్కడ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు గుర్తించారు. కానీ, సమాచారం ఇవ్వకపోవడంతో భారీ నష్టానికి దారితీసింది. వర్షం అంతకంతకూ పెరిగి భారీగా వరద రావడంతో.. సొరంగమార్గాల్లోకి ఒక్కసారిగా నీరు వచ్చిచేరింది. వట్టెం సర్జిపూల్‌లోకి వచ్చిన నీరంతా కుమ్మెర చెరువుకు చెందినవని అధికారులు భావించారు.
హుటాహుటిన అక్కడికి వెళ్లి నీటికి అడ్డుకట్ట వేశారు. అయి నా ఇంకా నీళ్లు వస్తుండడంతో ఎక్కడి నుంచి వస్తు న్నాయని ఆరా తీసేలోగా నష్టం జరిగిపోయింది. నా గనూల్ చెరువు నుంచి భారీగా వరద వస్తున్న విషయాన్ని అధికారులకు కాంట్రాక్టర్ సమాచారం ఇవ్వకపోవడంతో భారీ ఆస్తి నష్టానికి దారి తీసింది. ఇది లా ఉండగా, నీటిని బయటకు తీసేందుకు భారీ మో టర్లను సిద్ధం చేస్తున్నారు. నీళ్లను తీడేందుకు కనీసం నెల పట్టే అవకాశం ఉంద ని ఓ అధికారి వివరించా రు. ఆరు చోట్ల డీవాటరింగ్‌కు ఏర్పాట్లు చేశారు.
పంప్‌హౌస్ మునిగిపోవడంలో అధికారుల నిర్లక్ష్యం ఉన్నా.. జిల్లాకు చెందిన మంత్రి, ఎమ్మెల్యే లు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తున్నది. ఇంత పెద్ద ఎత్తున నష్టం జరిగినా కాంగ్రెస్ సర్కార్ పట్టనట్లు వ్యవహరిస్తున్నది. కనీసం వట్టెం పంప్‌హౌస్‌ను పరిశీలించేందుకు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులెవరూ రాకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నా.. వట్టెంపై రాజకీయాలు చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని నిర్లక్ష్యం వహించిన కాంట్రాక్టర్, పట్టించుకోని అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
పాలమూరు ప్రాజెక్టు పరిధిలోని వట్టెం రిజర్వాయర్ పంప్‌హౌస్‌ను వరద ముంచెత్తడానికి కారణం అధికారుల స్వయంకృతాపరాదమే అన్న ఆరోపణ లు వినిపిస్తున్నాయి. వరద నీరు టన్నెల్లోకి వెళ్లకుం డా ముందస్తు చర్యలు చేపట్టి ఉంటే ఇంత ప్రమా దం జరిగి ఉండేది కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మంగళవారం విషయం తెలుసుకొన్న ఇంజినీరింగ్ అధికారులు చెరువు నుంచి వచ్చే వరద కు అడ్డుకట్ట వేసే పనిలో నిమగ్నమయ్యారు. శ్రీపు రం శివారులో ఉన్న సొరంగం వద్ద పెద్దపెద్ద రా ళ్లు అడ్డం వేసి రక్షణ గోడను ఏర్పాటు చేసి ప్రవాహా న్ని అడ్డుకొనే పనులు ముమ్మరం చేశారు. పూర్తిస్థాయి లో నీటి రాకను నిలిపివేస్తేనే డీవాటరింగ్‌కు మా ర్గం సుగమమవుతుందని అధికారులు భావిస్తున్నారు.