వనపర్తి నవంబర్ 8 (నమస్తే తెలంగాణ) : వనపర్తి నియోజకవర్గంలో ఆత్మీయ సమ్మేళనాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే దాదాపు 50కి పైగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించడం చూస్తుంటే బీఆర్ఎస్పై ప్రజల్లో ఎంతటి నమ్మకం ఏర్పడిందో ఇట్టే అర్థమవుతున్నది. అన్ని రంగాలు, వర్గాల ప్రజలతో మమేకమై సమ్మేళనాలను నియోజకవర్గమంతా దిగ్విజయంగా నిర్వహించారు. దీంతో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సమ్మేళనాల ద్వారా నాయకులు, కార్యకర్తలు,అన్ని వర్గాల ప్రజలకు మరింత చేరువ చేశారు. ఒక్కో సమ్మేళనంలో దాదాపు 2వేలకు పైగా ముఖ్యులు పాల్గొనేలా చేసి కొత్త ఉత్సాహం నింపారు. గ్రామ స్థాయిలో సాధారణ కార్యకర్త నుంచి ముఖ్య నాయకుడి వరకు ఈ సమ్మేళనాలు కదిలించాయి. అభివృద్ధిని గుర్తు చేస్తూ ఇంకా మున్ముందు చేపట్టాల్సిన ముఖ్య పనులను వీటి ద్వారా గుర్తించి వాటికి ఓ రూపం ఇవ్వడంతో నాయకుల్లో మరింత విశ్వాసం పెరిగింది. అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రచారం చేసుకునేలా ఆత్మీయ సమ్మేళనాలు కార్యకర్తలను కార్యోన్ముఖులను చేశాయి.
నియోజకవర్గంలోని 7మండలాలతోపాటు రెండు మున్సిపాల్టీల వారీగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. దాదాపు ఆరు నెలలకు పైబడి ఈ సమ్మేళన సంబురం అసెంబ్లీ వారీగా కొనసాగింది. పెబ్బేరు, శ్రీరంగాపురం, గోపాల్పేట, రేవల్లి, ఖిల్లాఘణపురం, పెద్దమందడి, వనపర్తి మండలాల వారీగా సమ్మేళనాలను నిర్వహించారు. అలాగే వనపర్తి, పెబ్బేరు మున్సిపాలిటీల్లోనూ సమ్మేళనాలను నిర్వహించారు. నియోజకవర్గంలో దాదాపు 50వరకు ఆత్మీయ సమ్మేళనాలను చేపట్టారు. మండల స్థాయిలో ఒక సమ్మేళనం నిర్వహించి, ఆయా వర్గాల వారీగా, కులవృత్తుల వారీగా కూడా సమావేశాలను ప్రణాళికతో ఏర్పాటు చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, అలాగే ప్రత్యేకించి వనపర్తి నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులపై డాక్యుమెంటరీని బీఆర్ఎస్ రూపొందించింది. ప్రతిరోజూ ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంచుకుని సాయంత్రం ప్రజలందరినీ సమీకరించి ఎల్ఈడీ స్క్రీన్స్ ద్వారా చూపించారు. ఆటపాటలతో కనువిందు చేస్తూ అక్కడికి వచ్చిన ప్రజలందరితో సహఫంక్తిగా భోజనాలు చేస్తూ పథకాలను ప్రచారం చేశారు. అలాగే మున్సిపాలిటీల్లోనూ వార్డుల వారీగా ఎల్ఈడీ స్క్రీన్స్‌ను పెట్టి ప్రభుత్వ పథకాలను, అభివృద్ధి పనులను ప్రజల వద్దకు ఓ ప్రత్యేక డ్రైవ్‌గా తీసుకెళ్లడంలో బీఆర్ఎస్ సక్సెస్ అయ్యింది.
ఆత్మీయ సమ్మేళనాలు ప్రారంభమైనప్పటి నుంచి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నివర్గాల ప్రజలతో మమేకమయ్యారు. బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి వారితో కూడా సాన్నిహిత్యం పెంచుకున్నారు. అలాగే జిల్లా కేంద్రంలో ఆయా వర్గాలు, వృత్తుల వారీగా సమ్మేళనాలు ఏర్పాటు చేసి వారికి అవసరమైన పనులను గుర్తించి అమలు చేసేలా చర్యలు తీసుకున్నారు. ఇలా అవకాశమున్న అన్ని వర్గాల ప్రజలతో ఆత్మీయంగా వెల్లడం ద్వారా మంత్రి సింగిరెడ్డి మరింత చేరువయ్యారు. ఏ ఒక్క కుల సంఘాలను సైతం వదలకుండా సమీకృతంగా కలిసి వాళ్ల అభిమానాన్ని పొందుతున్నారు. వరుస కార్యక్రమాలతో ఏఒక్కరోజును బీఆర్ఎస్ వదులుకోవడం లేదు. వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ అందరితో మంత్రి సింగిరెడ్డి కలుస్తూ వెళ్లడం వచ్చే ఎన్నికలకు గెలుపుబాటను సూచిస్తున్నది.